బురుజుపేటలో జనజాతర
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, విశాఖవాసుల ఆరాధ్యదైవం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం మార్గశిర మాసోత్సవాలతో కళకళలాడుతోంది. ఉత్సవాల్లో భాగంగా రెండో గురువారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి నుంచే బురుజుపేట పరిసరాలు కిటకిటలాడాయి. గురువారం ఒక్క రోజే సుమారు 40 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
వైభవంగా విశేష పూజలు : వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణాలు, వేద పారాయణాలు, శ్రీ చక్రార్చన, లక్ష్మీ హోమం వంటి విశేష క్రతువులను నిర్వహించారు. పసుపు, కుంకుమ జలాలతో పాటు పెద్ద ఎత్తున క్షీరాభిషేకం నిర్వహించి అమ్మవారికి పసుపు పూశారు. అనంతరం స్వర్ణాభరణ అలంకరణ చేసి బుధవారం అర్థరాత్రి 12.05 నుంచి 1.30 గంటల వరకు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తర్వాత వెండి కవచం తొడిగారు.
బురుజుపేటలో జనజాతర


