విన్యాసాలు లేవు.. వీక్షకులు లేరు!
డాబాగార్డెన్స్: డిసెంబర్ 4.. ఈ తేదీ రాగానే నగరవాసుల చూపు ఆకాశం వైపు.. మనసు సాగరం వైపు మళ్లుతుంది. కానీ గతేడాది లాగే ఈ ఏడాది కూడా ఆ అద్భుత దృశ్యాలు కనుమరుగయ్యాయి. నేవీ డే సందర్భంగా ఏటా ఆర్కే బీచ్ వేదికగా జరిగే యుద్ధ విన్యాసాలు ఈ సారి కూడా విశాఖలో జరగకపోవడంతో సాగర తీరం వెలవెలబోయింది. సాధారణంగా నేవీ డేకి వారం రోజుల ముందు నుంచే విశాఖలో పండగ వాతావరణం నెలకొనేది. యుద్ధ విమానాల గర్జనలు, నౌకల విన్యాసాలతో రిహార్సల్స్ జరుగుతుంటే జనం తండోపతండాలుగా తరలివచ్చేవారు. ఇక డిసెంబర్ 4న అయితే నగరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే జనంతో ఆర్కే బీచ్ కిక్కిరిసిపోయేది. కానీ, ఈ ఏడాది ఆ సందడి పూర్తిగా లోపించింది. ఆర్కే బీచ్, గోకుల్ పార్క్, పాండురంగాపురం ప్రాంతాలు జనం లేక, పర్యాటకులు రాక బోసిపోయాయి. నేవీ డేను విశాఖ వెలుపల నిర్వహించడంతో.. ఈ సారి కేవలం యుద్ధ స్మారక స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించడానికే వేడుక పరిమితమైంది. తమ కళ్లెదుట జరిగే సాహస కృత్యాలను చూసి పరవశించే అవకాశం కోల్పోయామని.. రెండేళ్లుగా విశాఖకు ఈ వైభవం దక్కకపోవడం బాధాకరమని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.


