లేబర్ కార్డుతో ఎంతో ప్రయోజనం
● కార్మికశాఖ జిల్లా అధికారిసూర్యనారాయణ
ముంచంగిపుట్టు: అసంఘటిత రంగ కార్మికులు ప్రతి ఒక్కరు లేబర్ కార్డు కలిగి ఉండాలని కార్మికశాఖ జిల్లా అధికారి టి.సూర్యనారాయణ సూచించారు. స్థానిక కల్యాణ మండపంలో గురువారం మండల భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ లేబర్ కార్డు ఉంటే ప్రభుత్వ పథకాలు పొందేందుకు, ఆరోగ్య బీమా, పిల్లల విద్య, పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం, ప్రమాద బీమా, పించను పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్మికుడికి అధికారిక గుర్తింపు పత్రంగా పనిచేస్తున్నందున అందరూ లేబర్ కార్డు పొందాలని ఆయన కోరారు. వినియోగదారుల సంఘ చైర్‌పర్సన్ చిట్టిబాబు, డీసీపీసీ మెంబర్ శివప్రసాద్, డీసీపీసీ ఉపాధ్యాక్షుడు సోములు, మండల భవన నిర్మాణ కార్మికుల సంఘ అధ్యక్షుడు రవి, ఉపాధ్యక్షుడు నర్సింగ్ పాల్గొన్నారు.


