నల్లరాయి క్వారీతో తీవ్ర నష్టం
నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ
ఐటీడీఏ ఎదుట ఆందోళన
రంపచోడవరం: నరసాపురం నల్లరాయి క్వారీ వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని, వెంటనే కార్వీలో బ్లాస్టింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు స్థానిక ఐటీడీఏ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు కాకి మధు మాట్లాడుతూ క్వారీ వల్ల పంటపొలాలు నాశమవుతున్నాయని చెప్పారు. గిరిజనులకు అన్యాయం జరుగుతోందని, వారి తరఫున పోరాడుతున్న ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులపై తప్పుడు కేసులను పెట్టారని తెలిపారు. ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న క్వారీని నిలిపివేయాలని, క్వారీకి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దిరిసినపల్లి , నరసాపురం బాధితులకు న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఐటీడీఏ పీవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కుంజా శ్రీను, తీగల బాబురావు తదితరులు పాల్గొన్నారు.


