విద్యుత్ వైర్లు తగిలి గాయపడిన విద్యార్థి మృతి
గాజువాక: హెచ్‌టీ విద్యుత్ వైర్లు తగలడంతో గాయపడ్డ విద్యార్థి ఆకాష్ కుమార్ మృతి చెందాడు. పాతగాజువాక దరి శ్రీనివాసనగర్‌కు చెందిన ఆకాష్ కుమార్ ఆదివారం మధ్యాహ్నం మేడపైకి వెళ్లి గాలిపటం ఎగురవేస్తుండగా మేడపై గల ట్రాన్స్‌కో హెచ్‌టీ లైన్‌కు తగలడంతో తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శరీరం 90 శాతం కాలిపోవడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆకాష్ మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడి తండ్రి సురేష్‌కుమార్ గాజువాక ఆటోనగర్‌లోని ఒక కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నారు. మృతునికి తల్లిదండ్రులతోపాటు సోదరి, సోదరుడు ఉన్నారు.


