బంతి రైతు ఉసూరు
సాక్షి,పాడేరు: గిరిజన రైతులు మన్యంలో సాగు చేస్తున్న బంతిపూల ధరలు ఒక్కసారిగా భారీగా పతనం అయ్యాయి.మొన్నటి వరకు బుట్ట బంతిపూలు రూ.100 నుంచి రూ.150 ధరతో కొనుగోలు చేసిన వ్యాపారులు గత మూడు రోజుల నుంచి ధర తగ్గించేశారు. బుట్ట పూలకు రూ.20కు మించి ధర రాకపోవడంతో గిరి రైతులు ఉసూరుమన్నారు. మైదాన ప్రాంతాల్లో బంతిపూలకు గిరాకీ ఉన్నప్పటికీ స్థానిక వ్యాపారులంతా పూల ధరలను పతనం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరంతా సిండికేట్‌గా ఏర్పడి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.,
● బంతిపూల సీజన్ మరో రెండు నెలల వరకు ఉంటుంది. ఏటా సీజన్ చివరి వరకు బుట్ట బంతిపూల ధర రూ.100 వరకు ఉంటుంది. మన్యం బంతిపూలకు విశాఖతో పాటు రాజమహేంద్రవరం, గుంటూరు, విజయవాడ,తెలంగాణలో హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో అధిక డిమాండ్ ఉంది. అయినప్పటికీ వ్యాపారులు మాత్రం గిరిజన రైతు ల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల మోత కూలీ కూడా దక్కని పరిస్థితి ఎదుర్కొంటున్నామని గిరి రైతులు వాపోతున్నారు.
● జి.మాడుగుల,పెదబయలు,హుకుంపేట,పాడేరు మండలాల్లో పండించిన బంతి పూలను గిరిజన రైతులు పాడేరు పాతబస్టాండ్ మార్కెట్‌కు బుట్టలతో తీసుకువస్తుంటారు. కొంతమంది గిరిజన రైతులు కాలినడకన మోసుకువస్తుండగా, దూర ప్రాంతాల రైతులు ఆటోల్లో తెస్తున్నారు.అంత దూరం నుంచి బంతిపూలను పాడేరు మార్కెట్‌కు తీసుకు వస్తున్నా పూల ధరలు భారీగా తగ్గడంతో మోతకూలీ కూడా రావడం లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంతి బుట్ట పూలను వ్యాపారులు రూ.20కు మించి కొనుగోలు చేయడం లేదని వారంతా వాపోతున్నారు. అయితే తక్కువ ధరకు కొనుగోలు చేసిన పూలను మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న వ్యాపారులకు మాత్రం లాభాలు ఆర్జిస్తున్నారు.
ఎంతో శ్రమతో బంతిని పండించిన రైతుకు నష్టాలు తప్పడం లేదు. మార్కెట్లో పరిస్థితులు కలిసిరానందున కొన్ని సందర్భాల్లో పెట్టుబడి కూడా దక్కని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పాడేరు మార్కెట్లో మూడు రోజులుగా ధర పతనంతో ఉసూరుమన్నారు.
చాలా అన్యాయం
బుట్ట బంతిపూలను రూ.20తో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఆరు బుట్టల పూలను 15కిలోమీటర్ల దూరం నుంచి మోసుకువచ్చా. రూ.120 మాత్రమే ఆదాయం వచ్చింది. ఖాళీ బుట్టలు, చార్జీలకు రూ.40 మినహాయిస్తే కేవలం రూ.80 మాత్రమే మిగిలింది. పూల సేకరణ, కాలినడకన పాడేరు వరకు తీసుకువచ్చేందుకు ఎంతో కష్టపడ్డా. పూల ధరను వ్యాపారులు పతనం చేయడం అన్యాయం
– పాంగి ముసిరి, పూల రైతు,
కుంతుర్ల, హుకుంపేట మండలం
భారీగా ధర పతనంతో దిగాలు
బుట్ట పూలు రూ.100 నుంచి రూ.150కు కొనుగోలు
మూడు రోజులుగా
రూ.20కు పడిపోయిన ధర
వ్యాపారుల సిండికేట్‌తో
నష్టపోతున్నామని గిరి రైతుల ఆవేదన
కనీసం మోత కూలి ఖర్చులు కూడా రాలేదని ధ్వజం
బంతి రైతు ఉసూరు
బంతి రైతు ఉసూరు


