వరదనీటి అంచనాకు అధునాతన పరికరం
గోదావరి వంతెనపై ఏర్పాటు
చింతూరు: వరదనీటి ప్రవాహాన్ని అంచనా వేసేందుకు భద్రాచలంలోని గోదావరి వంతెనపై అధునాతన పరికరాన్ని ఏర్పాటుచేశారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ ఆధ్వర్యంలో ‘ఎంట్రోపీ ఇమేజ్ ప్రాసెసింగ్ బేస్డ్ నాన్ కాంటాక్ట్ డిక్జార్జ్ మానిటరింగ్ టెక్నిక్’ అనే యంత్రాన్ని వంతెనపై అమర్చారు. దీని ద్వారా నది ఉపరితల ప్రవాహ వేగాన్ని కచ్చితమైన సమాచారంతో విశ్లేషించే అవకాశం ఉంటుంది. ఈ పరికరం ద్వారా రాబోయే 24 గంటల్లో భద్రాచలంకు ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద వస్తుందో అంచనా వేయడంతో పాటు దిగువ ప్రాంతమైన ఆంధ్రాలోకి ఎన్ని క్యూసెక్కుల నీరు వెళుతుందో ముందుగానే శాసీ్త్రయంగా తెలుసుకునే వీలుంటుందని అధికారవర్గాలు తెలిపాయి. ఎగువ ప్రాంతం నుంచి ఎంత వరద వస్తుందో ముందుగానే తెలుసుకునే అవకాశమున్నందున దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసేందుకు ఈ పరికరం దోహద పడుతుందని వారు పేర్కొన్నారు. ఏటా భద్రాచలంకు దిగువనున్న ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలు వరదపోటుకు గురవుతున్నాయి. వరద ఏస్థాయిలో వస్తుందనే కచ్చితమైన సమాచారం లేకపోవడంతో నాలుగు మండలాలను వరద ముంచెత్తుతోంది. ప్రస్తుత పరికరం పోలవరం ముంపు మండలాలతో పాటు తూర్పు గోదావరిలోని లంక గ్రామాలకు కూడా ముందుగానే వరద సమాచారం అందించే అవకాశం ఉంటుంది. కాగా ఈ పరికరం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పట్టనుంది. భద్రాచలం వద్ద గతంలో వచ్చిన వరద ప్రభావాలను పరిశీలిస్తే 1986లో గరిష్టంగా 75.60 అడుగుల నీటిమట్టం నమోదుకాగా 27.02 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. 2022లో 71.30 అడుగుల నీటిమట్టం నమోదుకాగా 24.43 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించగా ఈ ఏడాది ఆగస్టులో అత్యధికంగా 51.9 అడుగుల నీటిమట్టం నమోదై 13.66 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించింది.


