బోధనేతర పనులకు బాధ్యులను చేయడం సరికాదు
● యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
మహేశ్వరరావు
● పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల ఎదుట నిరసన
పాడేరు: గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉపాధ్యాయులను బోధనేతర పనులన్నింటికీ బాధ్యులను చేయడం సరికాదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి.మహేశ్వరరావు అన్నారు. స్థానిక ఐటీడీఏ వద్ద గురువారం యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 18న గిరిజన సంక్షేమ డైరెక్టర్ నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో ఉపాధ్యాయులు రాత్రి 9గంటల నుంచి 12 గంటల వరకు విధులు నిర్వహించాలని, ప్రతి రోజు ఉదయం 6గంటలకు తప్పనిసరిగా ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని ఆదేశించారన్నారు. మూడో వంతు ఉపాధ్యాయులు రాత్రి పూట బస చేయాలని ఆదేశించడమే కాకుండా విద్యార్థుల ఆరోగ్యానికి సైతం ఉపాధ్యాయులని ఏకపక్షంగా బాధ్యుల్ని చేయడాన్ని యూటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.ఆశ్రమ పాఠశాలలో ఏఎన్‌ఎంలు, పూర్తిస్థాయి వార్డెన్లు నియమించాలని, విద్యార్థులకు మెస్ చార్జీలు, పాఠశాల నిర్వహణకు నిధులు పెంచాలని అన్నారు. గిరిజన సంక్షేమ డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు టి.చిట్టిబాబు, జిల్లా కార్యదర్శులు ఎం.ధర్మారావు, పి.దేముడు, ఎస్.కన్నయ్య, ఆడిట్ కమిటీ కన్వీనర్ కె.రఘునాఽథ్, చీకటి నాగేశ్వరరావు, మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీను, ఎస్.గంగాధర్, ఎల్.చంద్రశేఖర్, రాంబాబు, కాకరి రాజారావు, ఎస్.బాలకృష్ణ, సీసా గోపి తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం: గిరిజన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఐటీడీఏ ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ తెలిపారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సింది పోయి గిరిజన ఉపాధ్యాయులకు బోధనకు బదులుగా బోధనేతర పనులను అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు అనేకమార్లు అధికారులు దృష్టికి తీసుకువచ్చిన నేటికి పరిష్కారం చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా కోశాధికారి విశ్వరాజు, ఆదిరెడ్డి, సూరిబాబు, సనాతనబాబు, తదితరులు పాల్గొన్నారు.
బోధనేతర పనులకు బాధ్యులను చేయడం సరికాదు


