ఆత్మవిశ్వాసమే ఆయుధంగా..
ఆరిలోవ (విశాఖ): క్రీడా స్ఫూర్తి ముందు ఏ అడ్డంకి నిలవదని నిరూపిస్తూ.. దివ్యాంగ బాలబాలికలు తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. సమగ్ర శిక్ష అభియాన్, విశాఖ పారాస్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తోటగరువు ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలకు జిల్లాలోని 11 మండలాల నుంచి సుమారు 200 మంది దివ్యాంగ బాలలు హాజరయ్యారు. వీరంతా భవిత కేంద్రాలలో ప్రత్యేక విద్యను అభ్యసిస్తున్నవారే కావడం విశేషం. వీరికి 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం, షాట్‌పుట్, జావెలెన్ త్రో, లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో వంటి క్రీడల్లో పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ప్రతి అంశంలోనూ ఉత్సాహంగా పాల్గొని, వారి క్రీడా నైపుణ్యాన్ని కనబరిచి అధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. పోటీలను ప్రారంభించి పర్యవేక్షించిన ఎస్‌ఎస్‌ఏ కో–ఆర్డినేటర్ జె. చంద్రశేఖర్, జిల్లా సహిత విద్యా సమన్వయకర్త ఉప్పలపాటి నీరజ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విజేతలతో పాటు పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్లను అందజేశారు. ఇక్కడ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలలను త్వరలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేయనున్నట్లు కోఆర్డినేటర్ చంద్రశేఖర్ తెలిపారు. ఎంఈవోలు రవీంద్రబాబు, అనురాధ, తోటగరువు హెచ్‌ఎం భవాని, ఏబీఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ కృష్ణకుమారి, పారాస్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా దివ్యాంగుల క్రీడా పోటీలు
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా..


