
పీహెచ్‌సీల ద్వారా మెరుగైన వైద్య సేవలు
ఏడీఎంహెచ్‌వో సరిత
ఇర్లపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులతో మాట్లాడుతున్న ఏడీహెచ్‌ఎంవో సరిత
రంపచోడవరం: పీహెచ్‌సీల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు అడిషనల్ వైద్యఆరోగ్యశాధికారి డాక్టర్ సరిత తెలిపారు. రంపచోడవరం సమీపంలోని ఇర్లపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆమె శనివారం సందర్శించారు. వసతి గృహంలో విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, పిల్లలు అనారోగ్యం బారిన పడితే తక్షణమే ఆస్పత్రికి తరలించాలని, నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం స్థానిక హెల్త్‌వెల్‌నెస్ సెంటర్, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు ఆశ్రమ పాఠశాలను సందర్శించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.