
చిత్తశుద్ధితో సేవలందిస్తున్న అధికారుల బదిలీ తగదు
చింతపల్లి: చింతపల్లి తహసీల్దారును మూడు నెలలకే అకారణంగా బదిలీ చేయడం దారుణమని స్థానిక ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసి పోతురాజు బాలయ్య పడాల్‌లు అన్నారు.మండల కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.ఇటీవల కూటమి ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా చింతపల్లికి పూర్తిస్థాయి తహసీల్దారును నియమించారన్నారు. దీంతో ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న అనేక రెవెన్యూ సమస్యలు వేగవంతంగా పరిష్కారమవుతాయని అనుకున్నామన్నారు. చిత్తశుద్ధితో ప్రజా సేవలందిస్తున్న తహసీల్దార్‌ను విధుల్లో చేరిన మూడు నెలల్లోనే డిప్యూటేషన్ పేరుతో అనకాపల్లి జిల్లాకు బదిలీ చేయడం దారుణమన్నారు. గిరిజన ప్రాంతానికి వచ్చి సేవలందిస్తున్న అధికారులను బదిలీ చేయడం,ఈ ప్రాంతానికి అవసరమైన కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌లను మైదాన ప్రాంతానికి తరలించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తహసీల్దారు బదిలీని నిలుపుదల చేయకపోతే మండలంలో గల అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
సోలార్ పవర్‌కు సూపర్ బూస్ట్.. జీఎస్టీ 2.0
సాక్షి, విశాఖపట్నం: జీఎస్టీ 2.0 అమలు ద్వారా సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పాదనకు సూపర్ బూస్ట్ ఇచ్చినట్లని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ ప్రచారంలో భాగంగా ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయం ఆవరణలో కలెక్టర్‌తో పాటు ఈపీడీసీఎల్ డైరెక్టర్ టీవీ సూర్యప్రకాష్, ఎస్‌ఈ జి.శ్యాంబాబు మొక్కలు నాటా రు. అనంతరం పీఎం సూర్యఘర్ రూఫ్‌టాప్ సోలార్ ప్లేట్స్ ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. అనంతరంఆయన మాట్లాడుతూ జీఎస్టీ స్లాబ్ రేట్ల తగ్గింపు ద్వారా పునరుత్పాదక శక్తి పరికరాలపై 12 నుంచి 5 శాతనికి తగ్గించడం పెద్ద ప్రోత్సాహకమన్నారు. జీఎస్టీ 2.0 కారణంగా వినియోదారులకు రూ.10 వేలు ఆదా అవుతుందని తెలిపారు. బయో గ్యాస్ యూనిట్ ధరలో రూ.10,000, 5 హెచ్‌పీ సోలార్‌పంప్ సెట్ ధరలో కూడా రూ.29 వేల వరకూ ఆదా అవుతుందని వివరించారు. డైరెక్టర్ సూర్యప్రకాష్, ఎస్‌ఈ శ్యాంబాబు మాట్లాడుతూ ప్రతీ ఒక్క గృహ వినియోగదారులు జీఎస్టీ 2.0, పీఎం సూర్యఘర్ పథకాల ద్వారా లబ్ధి పొందాలని, రూఫ్ టాప్‌పై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కాలుష్యం నివారించవచ్చని సూచించారు. కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీనివాసరావు, ఇతర విద్యుత్ శాఖ అధికారులు, సోలార్ వెండర్లు పాల్గొన్నారు. అంతకు ముందు సర్కిల్ కార్యాలయ ఉద్యోగులు, అధికారులతో కలిసి ఎస్‌ఈ శ్యాంబాబు జీఎస్టీ 2.0 అవగాహన ర్యాలీ నిర్వహించారు.
విద్యుత్ విప్లవంలో స్టార్టప్‌ల కోసం హ్యాకథాన్
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ సరఫరా, వినియోగంలో సరికొత్త ఆధునిక విప్లవాన్ని సృష్టిస్తూ.. డిస్కమ్‌లకు, వినియోగదారులకు ఉపయుక్తమయ్యే స్టార్టప్‌ల కోసం హ్యాకథాన్ నిర్వహిస్తున్నామని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి అన్నారు. సృజనాత్మక ఆవిష్కరణలను రూపొందించే స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో వచ్చే నెలలో హ్యాకథాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన శనివారం సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్(సీవోఈఈటీ), కై ్లమేట్ కలెక్టివ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హ్యాకథాన్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామన్నారు. హ్యాకథాన్‌లో ఎంపికై న స్టార్టప్‌లు తమ పరిష్కారాలను రాష్ట్ర విద్యుత్ రంగ ప్రముఖుల సమక్షంలో ప్రదర్శించే అవకాశంతో పాటు విజేతలకు పైలెట్ ప్రాజెక్టులు, 3 డిస్కమ్‌ల్లో పూర్తి స్థాయి ప్రాజెక్టులను అమలు చేసుకునే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ హ్యాకథాన్‌ను ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. ఈ నెల 22వ తేదీ రాత్రి 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు సూర్యప్రకాష్, వనజ, డి.చంద్రం, సీజీఎం సుమన్ కళ్యాణి పాల్గొన్నారు.

చిత్తశుద్ధితో సేవలందిస్తున్న అధికారుల బదిలీ తగదు