
బాలికల విద్యాభివృద్ధికి కృషి
రంపచోడవరం/గంగవరం : బాలికల విద్యాభివృద్ధికి, మహిళా సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా బాలికా శిశు సంరక్షణ అధికారి ఎం.కవిత అన్నారు. శుక్ర,శనివారాలు రెండు రోజుల పాటు ఆమె రంపచోడవరం డివిజన్‌లో విస్తృతంగా పర్యటించారు. గంగవరం మండలంలో గంగవరం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాల, కొత్తాడ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని రంపచోడవరంలో ఇర్లపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.
విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వృత్తి విద్యా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. ఆయా పాఠశాలల, విద్యాలయాల్లో వృత్తి విద్యాకోర్సులపై ఆమె ఆరా తీశారు. హెచ్‌ఎం వరలక్ష్మి, వృత్తి విద్యా ట్రైనర్స్ సుష్మా, భాగ్యలక్ష్మి, కొత్తాడ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ ప్రిన్సిపాల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.