
కలెక్టర్ దృష్టికి గ్రామాల సమస్యలు
కొయ్యూరు: బురుదగెడ్డపై వంతెన నిర్మించాలని కోరుతూ యూ.చీడిపాలెం సర్పంచ్ దడాల రమేష్, గొట్లుపాడు,కంపుమామిడితో పాటు పలు గ్రామస్తులు కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్‌కు బుధవారం వీరవరంలో వినతిపత్రం ఇచ్చారు. అడ్డతీగల మండలం వీరవరం పంచాయతీ చాకిరేవులలో కలెక్టర్ దినేష్‌కుమార్ పల్లెనిద్ర చేశారు. ఈ మేరకు పలువురు గ్రామస్తులు ఆయనను కలిసి సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. బురుదగెడ్డ, ఈదులబంద కాలువలపై వంతెనల కోసం వివరించారు.దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్టు గ్రామస్తులు తెలిపారు.
వి.ఆర్.పురం: మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు బుధవారం చింతూరులో చేపట్టిన గ్రీవెన్స్‌కు విచ్చేసిన కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మాదిరెడ్డి సత్తిబాబు, ఎంపీటీసీ సభ్యురాలు బందం విజయలక్ష్మి, సర్పంచ్ పిట్లా రామారావు, జిల్లా అధికార ప్రతినిధి చిక్కాల బాలకృష్ణ, ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు బోడ్డు సత్యనారాయణ మాట్లాడుతూ అన్నవరం బ్రిడ్జి కూలడంతో సుమారు 40 గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. పలు గ్రామాలకు అత్యవసర సేవలైన 108 104 సౌకర్యలు లేవన్నారు. త్వరగా బిడ్జి నిర్మించాలని కోరారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ స్ట్రక్చర్ వాల్యుషన్ పరిహారం సంబంఽధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్లు పూర్తి చేయాలన్నారు. నాయకులు పోడియం గోపాలరావు, కోటం జయరాజు, బంధం రాజు, చీమల కాంతారావు, మాచర్ల వెంగళరావు, ముత్యాల రాజు తదితరులు పాల్గొన్నారు.
కూనవరం: చినార్కూరు పంచాయతీలో వర్షాభావ పరిస్థితుల మూలంగా 550 ఎకరాలలో గిరిజన రైతులు పంటలు వేసుకునే పరిస్థితి లేదని, 15 స్తంభాలు వేస్తే అయా పొలాల్లోకి విద్యుత్ లైన్ వస్తుందని, విద్యుత్ మోటార్‌ల సౌకర్యం కల్పిస్తే వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందులు తొలిగుతాయని ఎంపీపీ పాయం రంగమ్మ, సర్పంచ్ సున్నం అబిరామ్‌లు చింతూరు ఐటీడీఏలో జరిగిన గ్రీవెన్స్‌కు విచ్చేసిన కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్‌కు బుధవారం వినతి పత్రం ఇచ్చారు. వరదల కారణంగా కొండ్రాజుపేట, టేకులబోరు రోడ్డు కోతకు గురవుతుందని, మరమ్మతు చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ఆయా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీపీ పాయం రంగమ్మ తెలిపారు. గ్రామస్తులు కుంజా లక్ష్మణ్‌రావు, సోడె వెంకటేష్ పాల్గొన్నారు.

కలెక్టర్ దృష్టికి గ్రామాల సమస్యలు

కలెక్టర్ దృష్టికి గ్రామాల సమస్యలు