
బధిరులకు సంకేత భాషతో నైపుణ్యం
పాడేరు : విభిన్న సామర్థ్యాలు కలిగిన వ్యక్తులు, వినికిడి లోపం ఉన్న వారిని నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దటం అత్యంత అవసరమని ఐటీడీఏ పీవో, ఇన్‌చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ అన్నారు. బుధవారం పట్టణంలోని కాఫీ హౌస్‌లో జాతీయ సంకేత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో బధిరుల కోసం ప్రత్యేకమైన సంకేత భాష (సైన్ లాంగ్వేజ్) ఉంటుందని, దీనిద్వారా పూర్తి స్థాయిలో నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దవచ్చన్నారు. సంకేత భాష నాట్యం లాంటిందన్నారు. పూర్వకాలంలో భరతనాట్యంలో మాటలు లేకుండా కేవలం ముఖ కవళికలు, చేతుల సంజ్ఞల ద్వారానే మహాభారతం, రామాయణం వంటి కథాంశాలు చెప్పేవారన్నారు. సైన్ లాంగ్వేజ్‌కు యూనిఫాం లాంగ్వేజ్ ఉందని ఇదోక ఆర్టిస్టిక్ టాలెంట్ అని అన్నారు. ఆసక్తి ఉన్నవారు దీనిని నేర్చుకోవచ్చన్నారు. ఆర్టిస్టిక్ ఫీల్డ్‌లో ఆసక్తి గలవారికి కాంటాక్ట్‌లు ఏర్పాటు చేయడానికి తాము బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ఇంట్లో ఉన్న బధిరులకు సైన్ లాంగ్వేజ్ నేర్పిస్తే వారి భావాలను వ్యక్తపరచడానికి వీలవుతుందన్నారు. సంకేత భాష వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత, పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ