
అర్హులైన గిరిజనులకు భూమికి భూమి
గంగవరం : దేవీపట్నం మండలం కొండమొదలు పోలవరం నిర్వాసితుల్లో అర్హులైన గిరిజనులకు భూమికి భూమి ఇస్తామని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని నేలదోనెలపాడు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్ రాజ్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. వీధిలైట్లు, పూర్తిస్థాయిలో తాగునీరు ఏర్పాటు చేయలని వారు కోరారు. సబ్ సెంటర్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా అప్‌గ్రేడ్ చేయాలని, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా స్థాయి పెంచాలని కోరారు. రాజవరం నుంచి నేలదోనెలపాడు వరకు చేపట్టిన రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోయాయని, వెంటనే బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. రేషన్ కార్డులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. కొండమొదలు సర్పంచ్ వేట్ల విజయ, స్థానికులు వంజం జోగారావు, ఇల్లా రామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ 12 గ్రామాలను కలిపి కొండమొదలు పేరు మీద ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుచేయాలని, ప్రతి 50 కుటుంబాలకు బోరు బావి నిర్మించాలని విన్నవించారు. కతనపల్లి గ్రామ గిరిజనులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని, ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో వెటర్నరీ అసిస్టెంట్ నియమించాలని కోరారు. వీటిపై స్పందించిన కలెక్టర్ జలజీవన్ మిషన్ పథకంలో ఆరు లేదా ఏడు బోర్లు ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వీధిలైట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పీహెచ్‌సీ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో చర్చిస్తామన్నారు. గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించేలా సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్ రాజ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్ మాట్లాడుతూ కొండ మొదలు పంచాయతీ ముంపు బాధితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ద్వారా భూమికి భూమి ఇస్తామన్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి .అంబేద్కర్, సతీష్, తహసీల్దార్లు సీహెచ్ శ్రీనివాసరావు, కరక సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఐ. శ్రీనివాసరావు, ఎస్‌బీవీ రెడ్డి, పీసా కమిటీ ఉపాధ్యక్షుడు పాపారావు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే లక్ష్మణ్ పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్ కుమార్

అర్హులైన గిరిజనులకు భూమికి భూమి