
ఈక్రాప్ నమోదు వేగవంతం
● వ్యవసాయాభివృద్ధికి చర్యలు
● అవకాడో, లిచీని ప్రోత్సహించాలి
● ఇన్‌చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ ఆదేశం
సాక్షి,పాడేరు: జిల్లాలో వ్యవసాయాభివృద్ధితో పాటు పంటల ఈక్రాప్ నమోదును వేగవంతం చేయాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. వ్యవసాయం, ఉద్యానవన, అనుబంధశాఖలు, పంచాయతీరాజ్, డ్వామా అధికారులతో మంగళవారం ఆమె వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ–క్రాప్, ఈ– పట్టాతో రైతులకు అన్నివిధాలుగా ప్రయోజనాలు ఉంటాయన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎం కిసాన్ దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. గ్రామ సచివాలయాల ద్వారా అర్హులైన రైతులను గుర్తించి బ్యాంకుల ద్వారా రుణాలు పంపిణీ చేయాలని, ఆర్‌వోఎఫ్‌ఆర్ రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రైతులు పండించిన పంటలకు దళారుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అవకాడో, లిచీ సాగును ప్రోత్సహించాలని, రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తేవాలన్నారు. జిల్లాలో మల్బరి సాగు విస్తరించాలని, ఈదిశగా రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలన్నారు. మత్స్యసంపద, పశువైద్య కార్యక్రమాలపైన దృష్టి పెట్టాలని, పశుబీమా అమలు చేయాలన్నారు. ఖరీఫ్, రబీ పంటల కోసం జిల్లాలో యూరియా, డీఏపీ నిల్వలు పెంచుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనలో అర్హులైన సభ్యులను తప్పక నమోదు చేసి, ఆపత్కాలంలో ప్రయోజనం అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన జిల్లా అఽధికారులు నందు, కర్ణ, డీఆర్‌డీఏ పీడీ మురళీ, డ్వామా పీడీ విద్యాసాగర్, జిల్లా పట్టుపరిశ్రమ అధికారి అప్పారావు, లీడ్ బ్యాంకు మేనేజర్ మాతునాయుడు పాల్గొన్నారు.