
లక్ష్యం, క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం
● పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్
పాడేరు : విద్యార్థులు ప్రాథమిక విద్య దశ నుంచి నిర్ధిష్టమైన లక్ష్యంతో క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్ సూచించారు. పట్టణంలోని కుమ్మరిపుట్టు గిరిజన గురుకుల కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు ఆవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్ధులు, మహిళలపై జరుగుతున్న దాడులు, ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. విద్యార్థులు తమ ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలన్నారు. మొబైల్ వాడుతున్న మహిళలు శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అత్యవసర సమయాల్లో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే యాప్‌లో సేఫ్ ట్రావెల్ ఆప్షన్స్‌పై క్లిక్ చేస్తే ఆ ప్రదేశంలోకి పోలీసులు వెంటనే చేరుకొని వారికి రక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు సీఐ దీనబంధు, కరాటే చీఫ్ ఇన్‌స్ట్రక్చర్ పాండురాజు పాల్గొన్నారు.