
సిగనాపల్లి క్వారీలోశాశ్వత బేస్ క్యాంప్
● రంగురాళ్ల తవ్వకాలను
ప్రోత్సహిస్తున్న మైదాన ప్రాంత
వ్యాపారులకు నోటీసులు
● అనకాపల్లి జిల్లా ఎస్పీ సహకారంతో వారిపై కేసులు పెట్టేందుకు చర్యలు
● చింతపల్లి డీఎఫ్‌వో నర్సింహరావు
చింతపల్లి: సిగనాపల్లి రంగురాళ్ల క్వారీ వద్ద అటవీ సిబ్బందితో శాశ్వత బేస్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు డీఎఫ్‌వో వై.నరసింహారావు తెలిపారు. బుదవారం ’సిగనాపల్లి క్వారీలో రంగురాఽశ్లు తవ్వకాలు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. గూడెంకొత్తవీధి మండలం పెదవలస రేంజి పరిధిలో ఉన్నటువంటి సిగనాపల్లి క్వారీలో ఎటువంటి తవ్వకాలు జరపకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తవ్వకాలు ప్రోత్సహిస్తున్నారనే ఉద్దేశంతో చింతపల్లికి చెందిన వ్యాపారులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. వీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కార్యాలయంలో సంతకాలు చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రంగురాళ్ల తవ్వకాలకు ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తున్న మైదాన ప్రాంతం నర్సీపట్నం, తునికి చెందిన 20 మందిని గుర్తించి, వారికి నోటీసులు జారీ చేశామన్నారు. వీరిపై కేసులు నమోదు చేసేందుకు అనకాపల్లి జిల్లా ఎస్పీ సహకారం తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. క్వారీ ప్రాంతంలో శాశ్వతంగా పది మందితో బేస్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తమ సిబ్బందితో 24 గంటలు గస్తీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్వారీ ప్రాంతంలో 144 సెక్షన్ అమలుకు గూడెంకొత్తవీధి తహసీల్దార్ ఆదేశాలు ఇచ్చారని డీఎఫ్‌వో పేర్కొన్నారు.