
మోడల్ పాఠశాల కోసం పట్టు
కొయ్యూరు: చింతలపూడి పంచాయతీ గింజర్తికి చెందిన 30 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. గింజర్తికి దగ్గరగా ఉన్న చింతలపూడి ప్రాథమిక పాఠశాలను ఈ ఏడాది మోడల్ పాఠశాలగా స్థాయి పెంచారు. గింజర్తిలో 47 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 3,4,5 తరగతులు చదివే 30 మందిని చింతలపూడి పాఠశాలకు పంపించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. ఈమేరకు వీరి పేర్లను గింజర్తి పాఠశాల యు డైస్ నుంచి తొలగించారు.అయితే గ్రామస్తులు చింతలపూడి పాఠశాలలో చేర్పించలేదు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న గింజర్తిని మోడల్ పాఠశాల చేయకుండా తక్కువ మంది ఉన్నచోట ఎలా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో 30 మంది విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గింజర్తి పాఠశాలలో ప్రస్తుతం ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. విద్యార్థులను చింతలపూడి పాఠశాలలో చేర్పించి గింజర్తి పాఠశాలలో చదువుకునేలా మరో ఉపాధ్యాయుడిని అక్కడికి పంపిస్తామని ఎంఈవో చెప్పినా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు.
పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు
గింజర్తి పాఠశాలను కాకుండా పిల్లలు తక్కువగా ఉన్న చింతలపూడిని మోడల్ పాఠశాలగా స్థాయి పెంచడం వల్ల అక్కడికి తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. ఒక విద్యాసంవత్సరం నష్టపోయినా ఫర్వాలేదని చెబుతున్నారు.గింజర్తిని మోడల్ పాఠశాలగా చేయాలని కోరుతున్నారు
– దేవర అప్పారావు, విద్యాకమిటీ చైర్మన్
ఉన్నతాధికారుల దృష్టికి సమస్య
గింజర్తి విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యను ఉన్నతాధికారుల దృిష్టికి తీసుకువెళ్లి పరిష్కరానికి చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు ఏమి చేస్తే మేలు జరుగుతుందో పరిశీలన చేస్తాం. వారిని గింజర్తిలోనే ఉంచాలని ఆదేశాలు ఇస్తే అలాగా చేస్తాం. తమ పిల్లల భవిషత్తు గురించి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి.
– బ్రహ్మాజీరావు, జిల్లావిద్యాశాఖాధికారి, పాడేరు
గింజర్తి విద్యార్థులను చింతలపూడి పాఠశాలలో చేర్పించని తల్లిదండ్రులు
యు డైస్‌లో నమోదుకాని
30 మంది పేర్లు
అగమ్యగోచరంగా వారి భవిష్యత్తు
సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాం:
డీఈవో బ్రహ్మాజీరావు

మోడల్ పాఠశాల కోసం పట్టు