
ఇళ్లల్లోకి నీళ్లు
● గర్జించిన గోదావరి
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
● గ్రామాల్లోకి వరద నీరు
● భద్రాచలం వద్ద
50 అడుగులకు చేరిన నీటిమట్టం
● శబరి నదికి ఎగపోటు
● ముంపులో రహదారులు
● సుమారు 100 గ్రామాలకు
నిలిచిన రాకపోకలు
చింతూరు: గోదావరికి వరద మంగళవారం మరింత పెరగడంతో విలీన మండలాల్లోని గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. ఇప్పటికే వీఆర్‌పురం మండలంలో శ్రీరామగిరి, గుండువారిగూడెం, వడ్డిగూడెం, కూనవరం మండలంలో ఉదయ్‌భాస్కర్ కాలనీ. గిన్నెలబజారు ఇళ్లలోకి నీరుచేరింది. దీంతో బాధితులు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
● భద్రాచలం వద్ద మంగళవారం తెల్లవారుజామున గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పటినుంచి గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ రాత్రికి 50 అడుగులకు చేరింది. కూనవరంలో గోదావరి నీటిమట్టం 46 అడుగులకు, చింతూరు వద్ద శబరినది నీటిమట్టం 35 అడుగులకు చేరి క్రమేపీ పెరుగుతున్నాయి.
● గోదావరి, శబరినదుల వరదనీరు రహదారులపై చేరడంతో చింతూరు డివిజన్లోని నాలుగు మండలాల్లో సుమారు వంద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా భద్రాచలం నుంచి కూనవరం, చింతూరు నుంచి వీఆర్‌పురం, ఆంధ్రా నుంచి ఒడిశాకు రాకపోకలు నిలిచిపోవడంతో రవాణావ్యవస్థ స్తంభించింది. వరద మరింత పెరగడంతో నాలుగు మండలాల్లో మిరప, వరి పంటలతో పాటు పొగాకు, పత్తి పంటలు, నార్లు నీటమునిగాయి.
చింతూరు మండలంలో..
గోదావరి ఎగపోటు కారణంగా చింతూరు మండలంలో శబరినది మంగళవారం మరింత పెరిగింది. దీంతో పలువాగుల వరద రహదారుల పైకి మరింత చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
● కుయిగూరువాగు వరద జాతీయ రహదారి–326పై చేరడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు, మండలంలోని కుయిగూరు, కల్లేరు, మదుగూరు, సూరన్నగొంది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
● సోకిలేరు, జల్లివారిగూడెం, చీకటివాగుల వరద కారణంగా చింతూరు నుంచి వీఆర్‌పురం, మండలంలోని నర్సింగపేట, ముకునూరు, చూటూరు, రామన్నపాలెం, చినశీతనపల్లి, కొండపల్లి, బొడ్రాయిగూడెం, పెదశీతనపల్లి, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, ఉలుమూరు, మల్లెతోట గ్రామాలకు కూడా రాకపోకలు స్తంభించాయి. దీంతోపాటు చంద్రవంకవాగు వల్ల కుమ్మూరుకు రాకపోకలు ఆగిపోయాయి. చింతూరు నుంచి కంసులూరు వెళ్లే రహదారిపై వరదనీరు చేరడంతో ఆ వైపుగా కూడా రాకపోకలు నిలిచిపోవడంతో ఎర్రంపేట, కారంగూడెం మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు. వరదనీరు రహదారిపై చేరడంతో సోకిలేరువాగు అవతల ఉన్న గ్రామాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో నాటుపడవపై ప్రయాణం సాగిస్తున్నారు.
కూనవరం: శబరి, గోదావరి వరద కారణంగా కూనవరం – భద్రాచలం ప్రధాన రహదారిలో పోలిపాక వద్ద మంగళవారం వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. కొండ్రాజుపేట రహదారిపై ఐదో రోజు కూడా వరదనీరు కొనసాగుతోంది. కోడ్రాజుపేట – వెంకన్నగూడెం మధ్యలో కాజ్‌వే పైకి వరద నీరు చేరడంతో ఈ మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి. గత ఐదురోజుల నుంచి కొండ్రాజుపేట, వాల్ఫర్డ్‌పేట, శబరి కొత్తగూడెం, పూసుగూడెం, కొత్తూరు, శ్రీరామపురం, ఆంబోతులగూడెం, జిన్నెలగూడెం, బండారు గూడెం, పెదార్కూరు కిందిగుంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయ భాస్కర్ కాలనీ, గిన్నెల బజారులోకి వరద నీరు చేరుతుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా 18 కుటుంబాలను టేకులబోరులో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి తరలించారు. అర్ధరాత్రికి కూనవరం– చట్టి మార్గం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాథరావు సూచించారు.
వీఆర్‌పురం: గోదావరి, శబరి వరదల నీరు గ్రామాల్లోని ఇళ్లలోకి వచ్చేస్తోంది. శ్రీరామగిరిలో నాలుగు, గుండుగూడెంలో 2, వడ్డుగూడెంలో మూడు ఇళ్లల్లోకి నీరే రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిగతా ఇళ్లల్లోకి కూడా నీరు వచ్చేసి పరిస్థితి కనిపిస్తోంది. మండలంలో సుమారు 500 ఎకరాల్లో వరి, పొగాకు నాట్లు నీటమునగడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని సర్పంచ్ పిట్టా రామారావు, పీసా కమిటీ ఉపాధ్యక్షుడు కోటం జయరాజు ఆరోపించారు. గత మూడు నెలలుగా మూడు పంచాయతీల పరిధిలో గ్రామాలు నీటిలోనే ఉన్నా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని విమర్శించారు. బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరకులతోపాటు రూ.10 వేల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గోదావరి వరద తీవ్ర రూపం దాలుస్తుండటంతో విలీన మండలాల ప్రజలు వణికిపోతున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 50 అడుగులకు చేరడంతో శబరి నది ఎగపోటుకు వాగులు ఉప్పొంగాయి. రహదారులు ముంపునకు గురికావడంతో సుమారు వంద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది

ఇళ్లల్లోకి నీళ్లు

ఇళ్లల్లోకి నీళ్లు

ఇళ్లల్లోకి నీళ్లు