
విభిన్నంగా విజయదశమి
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో గిరిజనుల జీవనశైలి మాదిరిగానే వారు జరుపుకునే పండగలకు ప్రత్యేకత ఉంటుంది. కొత్తపాడేరులో దసరా పండగతో పాటు ముందురోజు ఫిరంగుల పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వం బ్రిటిష్ పాలనలో గిరిజన గ్రామాల్లో ముఠాదారు వ్యవస్థ ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతానికి చెందిన కిల్లు మాలంనాయుడు ముఠాదారుగా ఉండేవారు. యుద్ధ సమయంలో ఉపయోగించే ఫిరంగులకు బ్రిటిష్ వారు ఇక్కడ పూజలు చేసేవారని స్థానికులు చెబుతుంటారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత వారు దేశాన్ని విడిచి వెళ్లినప్పటికీ వారు రెండు ఫిరంగులను వదిలి వెళ్లారు. వీటిని అప్పట్లో కిల్లు మాలంనాయుడు ఇంట్లోని పూజ మందిరంలో కొలువుదీర్చారు. అప్పటినుంచి వాటికి పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన మరణాంతరం పూజలు చేసే ఆచారాన్ని వారసులు, స్థానికులు కొనసాగిస్తూ ఫిరంగులకు ఆయుధపూజ చేస్తున్నారు. పాత పాడేరులోని కిల్లు కుశలంనాయుడు ఇంట్లోని పూజామందిరంలో ఫిరంగులు, కత్తులకు కూడా బుధవారం ఆయుధ పూజ చేస్తారు
మొగలిదుర్గ, కనకదుర్గ అమ్మవార్లు..
పాతపాడేరులో స్వయంభూగా వెలసిన మొగలిదుర్గ, కనకదుర్గమ్మకు ఎంతో విశిష్టత ఉంది. వీటికి గిరిజనులు ఆలయం నిర్మించి, దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. కిల్లు, దుర్గపూజారి, గిడ్డి, జవ్వాది, పలాసి, అల్లంగి, దేశిది కుటుంబాలకు చెందిన ఏడుగులు గిరిజన పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. వీటికి దసరా రోజున మేకపోతును బలిస్తారు. తలభాగాన్ని రాతి విగ్రహాల ఉంచి అమ్మవార్లను కొలుస్తారు.
కొత్త, పాత పాడేరులో ముందురోజు
ఫిరంగుల పండగ
బ్రిటిష్ వారు విడిచివెళ్లిన
ఆయుధాలకు పూజ
అప్పటినుంచి ఆచారాన్ని కొనసాగిస్తున్న మాలంనాయుడు, కుశలంనాయుడు వారసులు

విభిన్నంగా విజయదశమి

విభిన్నంగా విజయదశమి