
త్వరితగతిన పనులు పూర్తి చేయాలి
రంపచోడవరం: ఏజెన్సీలోని వివిధ ఇంజనీరింగ్ శాఖల ద్వారా మంజూరైన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశపు హాలులో వివిధ శాఖలకు సంబంధించిన ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. పీవో మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తాగునీటికి సంబంధించిన ఆర్‌ఓ ప్లాంట్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు.గిరిజన విద్యార్థులకు మెను అమలులో, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో పూర్తి నాణ్యత ఉండాలన్నారు. వేడి ఆహార పదార్థాలను విద్యార్ధులకు అందించాలన్నారు. గిరిజన సంక్షేమ డీడీ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈఓ వై మల్లేశ్వరావు, ఏటీడబ్ల్యూఓలు ఆశ్రమ పాఠశాలలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాలపై చర్చించారు. పాఠశాలల్లో ప్రణాళిక ప్రకారం బోధన జరగాలన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు కొరకు ఎంత మంది గిరిజన రైతులున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెలుగు ఆధ్వర్యంలో జీడిమామిడి పిక్కల యూనిట్లు ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని యూనిట్లు పనిచేస్తున్నాయి అనే దాని వెలుగు ఏపీడీతో చర్చించారు. కొన్ని యూనిట్లుకు విద్యుత్ ఏర్పాటు చేయాలని పీవో దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్ ద్వారా ఎన్ని పనులు పూర్తి చేశారు, ఎన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది వంటి వివరాలను తెలుసుకున్నారు. గృహనిర్మాణ, మైనర్ ఇరిగేషన్, రోడ్డు నిర్మాణాలుపై సమీక్షించారు. సమావేశంలో ఏడీఎంఅండ్‌హెచ్‌ఓ డేవిడ్,ఈఈ ఐ శ్రీనివాసరావు, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్