
సేంద్రియ సాగుపై అవగాహన
ముంచంగిపుట్టు: గిరిజన రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని మండల వ్యవసాయశాఖాధికారి మురళీకృష్ణ అన్నారు.మండలంలోని వనభసింగి, ఏనుగురాయి పంచాయతీల్లో కొండపడ, లుంగాపుట్టు గ్రామాల్లో గురువారం పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులకు అవగాహన కల్పించారు. గోమూత్రము, పేడ, వేప ఆకులతో నీమాస్త్రం ద్రావణం తయారీని వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖాధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ రసాయన మందులకు దూరంగా ఉండాలని, దీంతో పంటలకు నష్టాలు కలుగుతాయన్నారు.సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మంచి దిగుబడి వస్తుందని రైతులంతా ఖచ్చితంగా వ్యవసాయశాఖ ద్వారా తెలియజేసే పద్ధతులు పాటిస్తూ వ్యవసాయం చేయాలని ఆయన కోరారు. డీఆర్‌సీ పాత్రుడు, ప్రవీణ్, సత్యనారాయణ, వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయ శాఖల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.