
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటం
● నేడు పాడేరులో శాంతియుత నిరసన
● విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు పిలుపు
సాక్షి,పాడేరు: పేదలకు ఉచిత వైద్య విద్య, కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు చర్యలు తీసుకోవడంపై వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రంలోని అన్ని వైద్యకళాశాలల వద్ద శాంతియుత నిరసన తెలిపాలని పార్టీ అధ్యక్షుడు, మాజీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు జిల్లా కేంద్రం పాడేరులోని వైద్య కళాశాల వద్ద శుక్రవారం శాంతియుత నిరసన, మీడియా సమావేశం నిర్వహణకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది.
విజయవంతం చేయాలి : వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగాలు సంయుక్తంగా శుక్రవారం పాడేరులో చేపట్టనున్న శాంతియుత నిరసన, మీడియా సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు జిల్లాలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా ఉదయం 11గంటలకు పాడేరు చేరుకోవాలని సూచించారు. పాడేరు వైద్య కళాశాల వరకు శాంతియుత ర్యాలీ జరుగుతుందన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ప్రజలకు తెలియజేసేందుకు మీడియా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని వైఎస్సార్‌సీపీ నేతలు, అరకు ఎంపీ, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, అన్ని మండలాల నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన, విద్యార్థి విభాగం నేతలంతా అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటం