
ఆటో బోల్తా: డ్రైవర్ మృతి
తగరపువలస: ఆనందపురం మండలం, కుసులవాడ పంచాయతీ శివారులోని మలుపు రోడ్డులో గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ యర్ర గౌరినా యుడు (39) మరణించాడు. చందక పంచాయతీ, జగన్నాథపురం గ్రామానికి చెందిన గౌరినాయుడు ఇంటికి తిరిగి వెళ్తుండగా, తీగలవానిపాలెం చెరువు వద్ద కుక్క అడ్డు రావడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడి చెరువులోకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో ఆటోలో అతను ఒక్కడే ఉన్నాడు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో ఆటో అతనిపై పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గౌరినాయుడు తన తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.