
ఏజెన్సీలో ఉద్యోగాలను ఆదివాసీలతోనే భర్తీ చేయాలి
గంగవరం: ఏజెన్సీలో ఆదివాసులతోనే ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టంపై ఎమ్మెల్యేలు , మంత్రులు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్ చేశారు. గంగవరంలో గురువారం నిర్వహించిన ఆదివాసీ సంక్షేమ పరిషత్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీలో ఉత్తీర్ణులైన గిరిజనేతర ఉపాధ్యాయులను ఏజెన్సీ పాఠశాలల్లో నియమించకుండా ఉండేలా చర్యలు తీసుకొనే విధంగా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రుల దృష్టికి ఆదివాసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీసుకువెళ్లాలన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హమీలను అమలుచేయాలన్నారు. గిరిజన అభ్యర్థుల కోసం ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాయకులు ప్రదీప్ కుమార్ దొర, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.