
ఉపాధ్యాయులనునియమించాలని ఆందోళన
గూడెంకొత్తవీధి: పాఠశాలలకు రెగ్యూలర్ ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ మంగళవారం డీఎల్‌వో రాష్ట్ర అధ్యక్షుడు కె.మార్క్‌రాజు తదితరులు ఎంఈవో కార్యాలయం ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు. గుమ్మిరేవుల పంచాయతీలో దాదాపుగా 36 పాఠశాలలకు ఉపాధ్యాయులు లేరన్నారు. దీని మూలంగా పాఠశాలలు మూతబడ్డాయన్నారు. ఉపాధ్యాయులను తక్షణమే నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. నేలజర్త పాఠశాలకు ఇంత వరకు రెగ్యూలర్ ఉపాధ్యాయులు లేక మాతృభాష వలంటీర్ ద్వారా బోధన జరుగుతుందన్నారు. మూడు సంవత్సరాల నుంచి ఇదే కొనసాగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి రెగ్యూలర్ ఉపాధ్యాయులను నియమించాలని లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.