
కూటమి ప్రభుత్వం అరాచక పాలన
జి.మాడుగుల: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు తిలోదకాలు లిచ్చి ఎన్నికల్లో అమలుచేయని హామీలను గుప్పించి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి, అరాచక పాలన సాగిస్తుందని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు నుర్మాని మత్స్యకొండంనాయుడు, సర్పంచ్ బోడిగి చిన్నకుమారి ధ్వజమెత్తారు. మండలంలో పెదలోచలి పంచాయతీ కేంద్రంలో పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు బుధవారం వైఎస్సార్‌సీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమంలో క్యూ ఆర్‌కోడ్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.
వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతూ వస్తుందన్నారు. రాష్ట్రంలో ఉచిత బస్చు అని చెప్పి బస్సు సర్వీసులు తగ్గించిందన్నారు.ఆటో డ్రైవర్‌కు రూ.15,000అని చెప్పి లేనిపోని నిబంధనలు పెట్టి డ్రైవర్లు మొండిచేయి చూపుతుందని విమర్శించారు. పేద, మధ్య తరగతి పిల్లలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉపయోగపడే మెడికల్ కాలేజ్‌లను గత ప్రభుత్వంలో జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా 17కాలేజీలు మంజూరు చేయగా అందులో ఐదు కాలేజీలకు మాత్రమే పూర్తిచేశారన్నారు.కూటమి ప్రభుత్వం మిగతా మెడికల్ కాలేజీలు అసంపూర్తిగా వదిలిపెట్టి భ్రష్టు పట్టిస్తుందని పీపీపీ విధానమని కొత్త నాటకానికి తెరతీసిందని వారు దుయ్యబట్టారు. వైఎఎస్సార్‌సీపీ నాయకులపై కూటమ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి అవలంబిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 19న పాడేరులో ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలివచ్చిన విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి నీలమ్మ, మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, నాయకులు అబ్బాయిదొర, కొండబాబు, లక్ష్మినాయుడు, కొండలరావు, వార్డు నంబర్ బాలయ్యపడాల్ తదితరలు పాల్గొన్నారు.