
వీధుల్లో కుక్కల స్వైరవిహారం
● ఆందోళనలో వృద్ధులు, చిన్నారులు
● గుంపులు గుంపులుగా సంచారం
● పెరుగుతున్న కుక్కకాటు బాధితులు
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా వేధిస్తుంది. ఏ వీధిలో చూసినా గుంపలు గుంపులుగా సంచరిస్తున్న శునకాలు ప్రజలను, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.రోడ్లపై నడవాలంటే భయమేస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో పరిస్థితి మరింత భయానకంగా తయారైంది. కుక్కలు వెంటపడి కరుస్తున్నాయని, వాహనాలపై వెళ్లేవారికి రోడ్డుకు అడ్డంగా వచ్చి మీద పడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాదచారులను వెంబడించడంతో వారు కిందపడి గాయాలపాలవుతున్నారని చెబుతున్నారు. మండల కేంద్రంలో కుక్కల సంఖ్య పెరిగాయని, ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా దాడులు చేస్తున్నాయని వాపోతున్నారు. గత రెండు నెలల వ్యవధిలో 45 కుక్క కాటు కేసులు నమోదైనట్టు స్థానికులు చెప్పారు. వీరిలో 29 మంది చిన్న పిల్లలు ఉండడం గమనార్హం. కుక్కల బెడదపై అనేకసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, వీధి కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.