
పంచాయతీల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
కొయ్యూరు: సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుఽలు కలిసి సమన్వయంతో పనిచేసి, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర కోరారు. సేవ చేసే వారిని ప్రజలు నిరంతరం గుర్తుపెట్టుకుంటారన్నారు. ఆమె మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యదర్శుల సమీక్షలో పాల్గొని మాట్లాడారు. ప్రొటోకాల్ పద్దతి ప్రకారం ప్రజలచేత ఎన్నుకోడిన ప్రజాప్రతినిధులకు ప్రతి కార్యక్రమానికి ఆహ్వానం అందించాలని సూచించారు.
కొన్నిచోట్ల ప్రజలు తిరస్కరించిన నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని,అది సరైన పద్దతి కాదని హెచ్చరించారు. పంచాయతీల అభివృద్దికి అంతా కలిసి తోడ్పాటును అందించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులు ప్రోటోకాల్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్పంచ్‌లకు పంచాయతీ కార్యదర్శులు విధిగా గౌరవాన్ని ఇవ్వాలన్నారు. కొయ్యూరు మండలంలో ఇద్దరు కార్యదర్శుల తీరు సరిగా లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇది గమనించాలన్నారు. సమిష్టి అందరు కలిసి పనిచేసి ప్రజలకు సంక్షేమాన్ని అందించాలని కోరారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో నిండి ఉండేలా చూడాలని దీంతో రోగాలు దరి చేరవన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థతో ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం వచ్చిందన్నారు. ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు అప్పారావు, వైస్ ఎంపీపీ నూకాలు మాట్లాడారు. ఇన్‌చార్జి ఎంపీడీవో బాలమురళీకృష్ణ పుష్పగుచ్ఛం ఇచ్చి సుభద్రకు స్వాగతం పలిచారు.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర