
హైడ్రోపవర్ ప్రాజెక్ట్ అనుమతుల రద్దుకు తీర్మానం
అరకులోయ టౌన్: మండలంలోని బస్కీ, లోతేరు, ఇరగాయి పంచాయతీ పరిధిలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని కోరుతూ బుధవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీర్మానం చేశారు. ఎంపీపీ రంజపల్లి ఉషారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులందరూ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తూ ఎంపీపీకి అందజేశారు. ఈ సందర్బంగా వైస్ ఎంపీపీ కిల్లో రామన్న మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల వందలాది ఎకరాల జిరాయితీ భూములు, అనేక గ్రామాలు, కాఫీ, మిరియం తోటలు జలమయం అవుతాయన్నారు. గిరిజనులు నిరాశ్రయులు అవుతారన్నారు. అటువంటి ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం పీసా కమిటీ ఆమోదం లేకుండా ఎలా అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు. గ్రామ పరిసరాల కొండలపై సరిహద్దు దిమ్మలు మీకు తెలియకుండా ఎవరు ఏర్పాటుచేశారని అధికారులను నిలదీశారు. సరిహద్దు దిమ్మల ఏర్పాటు విషయం తమకు తెలియదని అధికారులు బదులిచ్చారు. పూర్తిస్థాయిలో అధికారులు హజరుకానందున సమావేశం మొక్కుబడిగా జరిగింది.ఎంపీడీవో అడపా లవరాజు, జెడ్పీటీసీ శెట్టి రోషిణి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బీబీ లక్ష్మి, వైస్ ఎంపీపీ కుసుమాంజలి, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, స్వాభి రామచందర్, సర్పంచ్‌లు పాడి రమేష్, చినబాబు తదితరులు పాల్గొన్నారు.