వివాదంలో వంజంగి | - | Sakshi
Sakshi News home page

వివాదంలో వంజంగి

Sep 18 2025 7:04 AM | Updated on Sep 18 2025 7:04 AM

వివాద

వివాదంలో వంజంగి

● నిర్ణయాన్ని స్వాగతిస్తున్న కల్లలుబయలు, ఎస్‌.కొత్తూరు గిరిజనులు ● వ్యతిరేకిస్తున్న మిగతా గ్రామాల ప్రజలు

విశ్వవ్యాప్తి పొందిన వంజంగి హిల్స్‌ పర్యాటకంగా అభివృద్ధిపై అటవీశాఖ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దీనిపై పరిసర గ్రామాల నుంచి భిన్న స్వరాలు వినిపించడమే ఇందుకు కారణమవుతోంది. వంజంగి కొండను ఆనుకుని ఉన్న కల్లలుబయలు, ఎస్‌.కొత్తూరు గిరిజనులు అటవీశాఖ ఆధీనంలో పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. వంజంగి పంచాయతీలోని మిగిలిన గ్రామాలతో పాటు వంజంగి కొండకు దిగువన ఉన్న లగిశపల్లి, కాడెలి పంచాయతీల గిరిజనులంతా ఐటీడీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసి గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తుండటం అటవీశాఖకు కొత్త సమస్య ఎదురుకానుంది.

సాక్షి,పాడేరు: ప్రముఖ సందర్శిత ప్రాంతమైన వంజంగి హిల్స్‌ను ఐటీడీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసి వంజంగి, కాడెలి, లగిశపల్లి పంచాయతీలను భాగస్వామ్యం చేస్తామని గత కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ 2023లో ప్రకటించారు. ఈమేరకు చెక్‌గేట్‌లను ఏర్పాటు చేసి పర్యాటకుల నుంచి సేకరించిన ఆదాయాన్ని పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రెండేళ్లుగా వెచ్చిస్తున్నారు.

అటవీశాఖ ముఖ్య సంరక్షణ అధికారి

ఉత్తర్వులతో..

అటవీశాఖకు వంజంగి హిల్స్‌ అభివృద్ధి బాధ్యతను అప్పగిస్తూ అటవీశాఖ ముఖ్య సంరక్షణ అధికారి డాక్టర్‌ పీవీ చలపతిరావు ఈనెల ఐదున ఉత్తర్వులు జారీ చేశారు. వంజంగి హిల్స్‌లో పలు అభివృద్ధి పనులకు రూ.35లక్షల నిధులు కూడా విడుదల చేశారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు వంజంగి హిల్స్‌ అభివృద్ధికి సిద్ధమవుతున్న తరుణంలో కంబలుబయలు, ఎస్‌.కొత్తూరు గ్రామాల గిరిజనులు మినహా, మిగిలిన అన్ని గ్రామాల గిరిజనులు అటవీశాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు.

సర్వత్రా వ్యతిరేకత..

గత నెల తొమ్మిదో తేదీన సీఎం చంద్రబాబు వంజంగి గ్రామంలో పర్యటించినప్పుడు స్థానికులు వంజంగిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని వినతులిచ్చారు. ఐటీడీఏ ద్వారా రూ.కోట్ల వ్యయంతో అభివృద్ధి జరుగుతుందని అందరూ ఆశిస్తున్న తరుణంలో అటవీశాఖ నిర్ణయంపై వ్యతిరేకత నెలకొంది. అభివృద్ధికి తక్కువ నిధులు (రూ.35 లక్షలు) విడుదల చేయడంపై గిరిజనుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అన్ని ప్రాంతాల అభివృద్ధితో మేలు..

గతంలో వంజంగి, కాడెలి,లగిశపల్లి సర్పంచ్‌లు, గిరిజనులతో ఏర్పాటైన వంజంగి అభివృద్ధి కమిటీని కూడా ప్రభుత్వం పక్కన బెట్టడంపై వారి నుంచి నిరసన వ్యక్తమవుతోంది. వంజంగి హిల్స్‌కు కాడెలి, లగిశపల్లి పంచాయతీలో గ్రామాల మీదుగా పర్యాటకుల వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే రిసార్ట్‌లు, కాటేజీలు కూడా లగిశపల్లి, వంజంగి గ్రామాల్లోనే ఉన్నాయి. వంజంగి హిల్స్‌తో పాటు సమీప గ్రామాల్లో పర్యాటక అభివృద్ధిని గిరిజనులంతా కోరుకుంటున్నారు. వంజంగి హిల్స్‌తో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి జరిగితే గిరిజన యువ తకు స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తుందని వారు ఆశిస్తున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో కాకుండా ఐటీడీఏ ద్వారా వంజంగి అభివృద్ధికి రూ.కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసి అభివృద్ధి చేయాలని మెజారిటీ గ్రామాల గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు.

అటవీశాఖ నిర్ణయాన్నిస్వాగతిస్తున్నాం

కంబలుబయలు, ఎస్‌.కొత్తూరు గ్రామాలను ఆనుకుని వంజంగి కొండలు ఉన్నాయి. తమ గ్రామాలు కూడా రిజర్వ్‌ పారెస్ట్‌లోనే ఉన్నాయి.అటవీశాఖకు వంజంగి హిల్స్‌ అభివృద్ధిని అప్పగించడాన్ని స్వాగతిస్తున్నాం.అటవీశాఖ ద్వారా మా గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం.రోడ్డు నిర్మాణాలకు అటవీశాఖ అనుమతులు ఇవ్వాలి.

– మర్రి ప్రకాశరావు, కంబలుబయలు,

వంజంగి పంచాయతీ, పాడేరు మండలం

ఐటీడీఏకు అప్పగిస్తేనే మేలు

వంజంగి హిల్స్‌ను పర్యాటకంగా ఐటీడీఏ అభివృద్ధి చేయాలి. గతంలో మూడు పంచాయతీలకు మేలు చేసే విధంగా వంజంగి అభివృద్ధి కమిటీ ఏర్పాటైంది. వంజంగిని ఐటీడీఏ అభివృద్ధి చేస్తే మేలు జరుగుతుంది. గిరిజన యువతీ,యువకులకు ఉపాఽధి,ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. – లకే అబ్బాయిదొర,

గ్రామపెద్ద, లగిశపల్లి, పాడేరు మండలం

వంజంగి అటవీ ప్రాంతం అంతా రిజర్వుడు పారెస్ట్‌లోనే ఉంది. వంజంగి తారురోడ్డు జంక్షన్‌ నుంచి కంబలుబయలు, అవతల వంజంగి మేఘాల కొండలన్నీ అటవీశాఖ పరిధిలోనే ఉండడంతో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా అటవీశాఖ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. దీంతో ఐటీడీఏ వంజంగి హిల్స్‌ అభివృద్ధికి నిధులు మంజూరు చేయలేకపోయింది. అయితే వంజంగి హిల్స్‌ అభివృద్ధిని ఇటీవల అటవీశాఖ తెరమీదకు తెచ్చింది.

వంజంగి హిల్స్‌ పూర్తిస్థాయిలో అభివృద్ధి

రిజర్వ్‌ ఫారెస్ట్‌లో వంజంగి కొండలు ఉన్నందున అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు తమ శాఖ కృషి చేస్తోంది. వంజంగి హిల్స్‌ అభివృద్ధి బాధ్యతను ఇటీవల తమ శాఖ ఉన్నతాధికారులు అప్పగించారు. రూ.35 లక్షలు తొలి విడత విడుదల కాగా, రెండో విడత భారీ నిధులు వస్తాయి. వీటితో వంజంగి హిల్స్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తాం.

– సందీప్‌రెడ్డి, డీఎఫ్‌వో, పాడేరు

అభివృద్ధి బాధ్యత అటవీశాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులపై భిన్న స్వరాలు

రిజర్వ్‌ ఫారెస్ట్‌లోనే

మేఘాల కొండ..

వివాదంలో వంజంగి 1
1/4

వివాదంలో వంజంగి

వివాదంలో వంజంగి 2
2/4

వివాదంలో వంజంగి

వివాదంలో వంజంగి 3
3/4

వివాదంలో వంజంగి

వివాదంలో వంజంగి 4
4/4

వివాదంలో వంజంగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement