
పేద విద్యార్థులకు నష్టం
వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో
కొయ్యూరు: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ చేయడం వల్ల వైద్యవిద్య పేద విద్యార్థులకు దూరం అవుతుందని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, మాజీ జీసీసీ చైర్‌పర్సన్ స్వాతిరాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఈనెల 19న పాడేరులో నిర్వహిస్తున్న కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తరలిరావాలని పిలుపునిచ్చారు. బుధవారం వారు స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో 11 కళాశాలలు ఉండగా 2019లో సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత 17 వైద్య కళాశాలలు తీసుకువచ్చారన్నారు. వీటిలో ఐదు పూర్తయి తరగతులు నడుస్తున్నాయన్నారు. 2024 నాటికి పాడేరు, పులివెందుల కళాశాలలు సైతం పూర్తయ్యాయన్నారు. అయితే మిగిలిన పది కళాశాలలను ప్రభుత్వం పూర్తి చేయలేక ప్రైవేటుకు అప్పగించడం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ చేస్తే పేదవాడికి వైద్యం అందని దుస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించి వాటిని ప్రైవేటీకరించినా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ బడుగు రమేష్‌బాబు, జెడ్పీటీసీ వారా నూకరాజు పాల్గొన్నారు.
జి.మాడుగుల: వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ పాడేరులో ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన ఆందోళన కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, అనుబంధ విభాగాల కమిటీలు తరలిరావాలని వైఎస్సార్ యూత్ జిల్లా అధ్యక్షుడు గబ్బాడి శేఖర్ కోరారు.
జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, మాజీ ఎంపీ మాధవి, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, మాజీ జీసీసీ చైర్‌పర్సన్ స్వాతిరాణి ఆవేదన
పాడేరులో రేపు వైఎస్సార్‌సీపీ
ఆధ్వర్యంలో నిరసన
విజయవంతం చేయాలని పిలుపు