
కారవాన్ పార్కులకు ఐదుచోట్ల స్థలాలు
● 147 చోట్ల హోంస్టేలకు ఆమోదం
● కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో కారవాన్ పార్కులు ఏర్పాటుకు ఐదు చోట్ల స్థఽలాలు గుర్తించామని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన ఐటీడీఏ పీవోలు, ఐదుమండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పలుశాఖల అధికారులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశయంలో మాట్లాడారు. పాడేరు డివిజన్‌లో మూడు, రంపచోడవరం పరిధిలో రెండు స్థలాల్లో కారవాన్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజన గ్రామాల్లో కారవాన్ టూరిజం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశాయని ఏపీటీడీసీ ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. గుర్తించిన స్థలాల్లో సమస్యలు ఉంటే తహసీల్దార్లు త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈనెల 27న వరల్డ్ టూరిజం దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోది హోంస్టే పోస్టర్లను ఆవిష్కరిస్తారన్నారు. జిల్లా మొత్తం మీద 147 హోంస్టేలను ఆమోదించామని తెలిపారు. ట్రైబల్ టూరిజం కౌన్సిల్ ఏర్పాటు, గిరిజనుల ఫండ్ సమకూర్చడంపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.హోంస్టే నిర్వాహకులకు అతిథ్యంపై శిక్షణ అందిస్తామన్నారు. ప్రతి మండలం నుంచి కమ్యూనికేషన్ నైపుణ్యం కలిగిన వెల్ఫేర్ ఆసిస్టెంట్లను గుర్తించి తగిన శిక్షణ ఇవ్వాలని, హోంస్టేలు, కారవాన్ టూరిజం నిర్వహణపై జిల్లా సామరథ్యం పెంపుదల బృందం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ,వర్చువల్‌గా రంపచోడవరం ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్, సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ నిషితగోయల్, ఆర్కిటెక్ కన్సల్టెంట్ కలేశ్వర్, డీపీవో చంద్రశేఖర్, డీఎల్‌పీవో కుమార్ పాల్గొన్నారు.