
కొండ చరియలుతొలగించడంలో నిర్లక్ష్యం
● రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని తొలుగూరు గిరిజనుల ఆవేదన
● అధికారుల తీరుపై నిరసన
పాడేరు రూరల్: ఇటీవల వర్షాలకు రహదారిపై విరిగిపడిన చరియలను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఐన్నాడ పంచాయతీ తొలుగూరు గ్రామానికి చెందిన గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి తీరు పట్ల బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గుండన్న, నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు, బండరాళ్లు రహదారిపైనే ఉండిపోయాయన్నారు. దీనివల్ల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సేవలు అందక సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. బండరాళ్లు, కొండచరియలను తొలగించాలని సంబంధిత అధికారులను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హమీలు నేటికి అమలు కాలేదన్నారు. తక్షణం తమ సమస్యను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సమీప గ్రామాల గిరిజనులు ఎండన్న, రామన్న, శోభన్, బొంజుబాబు, నూకరాజు, చిట్టిబాబు పాల్గొన్నారు.