
పసుపు పంటకు గిట్టుబాటు ధర ప్రకటిస్తాం
చింతపల్లి: గిరిజన ప్రాంతంలో రైతులు పండించే కాఫీ మాదిరిగానే పసుపు పంటకు గిట్టుబాటు ధరను ప్రకటించనున్నట్టు మాతోట రైతుఉత్పత్తిదారులు సంఘ సీఈవో చిన్నారావు తెలిపారు. మంగళవారం స్థానిక మాతోట కార్యాలయంలో సంస్థ అధ్యక్షురాలు పూజేశ్వరమ్మ అధ్యక్షతన 8వ వార్షికోత్సవ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లి, జీకే వీధి మండలాల్లో కాఫీ పంటకు ఏటా ముందుగానే మద్దతు ధరను రైతు ఉత్పత్తిదారులు సంఘం ప్రకటిస్తోందన్నారు. దీంతో ప్రైవేట్ వ్యాపారులు సైతం తాము ప్రకటించిన ధరకంటే ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. కాఫీ పంట మాదిరిగానే పసుపు పంటకు కూడా ముందుగానే ప్రకటించి ఈప్రాంత రైతులను ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ ఏడాది నుంచి పసుపు పంటకు ధరను నిర్ణయించి రైతుల నుంచి సేకరిస్తామన్నారు. అధ్యక్షురాలు మాట్లాడుతూ రైతుల నుంచి పసుపు కొనుగోలు చేసిన వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమచేస్తామన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘ బోర్డు డైరెక్టర్లు నిర్ణయం మేరకు మద్దతు ధర నిర్ణయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంఽధ్రా వశ్మీరు, గంతన్నదొర రైతు ఉత్పత్తిదారుల సంఘం సీవోలు లోవ, మామిళ్ల నాగరాజు గిరిజన్ వికాస్ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.
మాతోట రైతు ఉత్పత్తిదారుల సంఘ
సీఈవో చిన్నారావు