
సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి
రంపచోడవరం: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని రంపచోడవరం పీవో స్మరణ్‌రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పీఎం జన్‌మన్ పథకం ద్వారా మంజూరైన పనుల ప్రగతిపై అధికారులతో చర్చించారు. పీఎం జన్‌మన్‌లో ఎన్ని గృహాలు మంజూరయ్యాయి, ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందో తెలుసుకున్నారు. అటవీశాఖ అభ్యంతరాల వల్ల ఎన్ని రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి, ఏఏ శాఖల రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి తదితర వివరాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. కొండరెడ్ల ఇళ్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటుపై ఏపీఈపీడీసీఎల్ ఇంజినీర్లతో చర్చించారు. ఈ ఏడాది ఎన్ని మెట్రిక్ టన్నుల జీడిమామిడి పిక్కలు కొనుగోలు చేశారో ఆరా తీశారు. జీడిమామిడి పిక్కల యూనిట్లను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఏపీడీ డేగలయ్య, పీహెచ్‌వో దేవదానంలకు సూచించారు.ఈ సమావేశంలో ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.