
గాడి తప్పిన పాలన
రంపచోడవరం: ఆదివాసీల అభివృద్దికి ప్రణాళికలు అమలకు పరిపాలనలో కీలకపాత్ర వహించే ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలకు దూరమైంది. గడిచిన ఏడాదిన్నర ఒక్క పాలకవర్గ సమావేశం కూడా నిర్వహించకుండా అధికారుల కనుసన్నల్లోనే పరిపాలన కొనసాగుతుంది. ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఐటీడీఏ సమావేశాల్లో గొంతు వినిపించే అవకాశం లేకుండా పోయింది. ఏడు మండలాల్లోని ప్రజలు కష్టా సుఖాలు చెప్పుకునేందుకు ప్రజా పరిష్కార వేదిక మాత్రమే ఒక వేదికగా ఉంది. ఐటీడీఏకు వచ్చే నిధులు ఖర్చు చేసే ముందు, ఖర్చు చేసిన తరువాత ప్రతి పైసాకు పాలకవర్గ సమావేశం ఆమోదం తెలపాల్సింది ఉంది. అయితే పాలకవర్గ సమావేశాల ఉసేత్తకుండా లెక్క పత్రం లేకుండా నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిందని పలువురు చెబుతున్నారు. ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేకుండా ఐటీడీఏ పాలన కొనసాగడం విడ్డూరమని చెబుతున్నారు. ఐటీడీఏకు పాలకవర్గంతో పనిలేకుండా పాలన కొనసాగడం పట్ల ఆదివాసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏజెన్సీలో నేటికి అనేక రోడ్డులు అటవీ అభ్యంతరాలతో పనులు నిలిచిపోయాయి.అనుమతుల కోసం అటవీశాఖ, ఇంజనీరింగ్, రెవెన్యూశాఖలు సంయుక్తంగా పనిచేస్తేనే అటవీ అనుమతులు కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాలకవర్గంలో ఇలాంటి సమస్యలు చెప్పినప్పుడు తక్షణమే ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసి అనుమతులు కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించేవారు. దీంతో ఆయా అధికారుల్లో ఒక జవాబుదారీతనం ఉండేది. గత కొన్నెళ్లుగా సమావేశాలు జరగకపోవడంతో ప్రజాప్రతినిధులు గ్రీవెన్స్‌లో అర్జీలు ఇవ్వడం తప్ప ఏమీ చేయలేదని పరిస్థితి నెలకొందని పలువురు చెబుతున్నారు. అటవీ అభ్యంతరాలతో పోతవరం–వై రామవరం రోడ్డు, పాతకోట– మంగంపాడు రోడ్డు, పందిరిమామిడి– కోట రోడ్డు, వేటుకూరు–తాడేపల్లి రోడ్డు ఇలా అనేక రోడ్డులకు మోక్షం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారుల నిర్మాణంతోనే గిరిజన గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని, గిరిజనులకు రవాణా వ్యవస్ధ మెరుగుపడుతుందని చెబుతున్నారు.
నిర్వాసితుల గోడు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నిర్వాసితులైన గిరిజనులకు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. దేవీపట్నం మండలంలో 44 గ్రామాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నిర్వాసితులైతే వారిలో గిరిజన నిర్వాసితులకు నేటికి భూమికి భూమి చూపించని పరిస్థితి ఉంది. పునరావాస కాలనీల్లో సమస్యలు వేధిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని పలువురు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలపై ఐటీడీఏలో చర్చ జరిగే పూర్తి స్ధాయిలో పరిష్కార మార్గాలు దొరికే అవకాశం ఉంటుందంటున్నారు. రంపచోడవరం ఐటీడీఏకు కలెక్టర్ చైర్మన్‌గాను, జెడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్‌గాను వ్యవహరిస్తారు. అరకు ఎంపీ, రంపచోడవరం, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్సీలు, ఏడు మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీలు సభ్యులుగా ఉన్నారు. ఐటీడీఏకు వచ్చిన నిధులపై ప్రతిపాదనలు, ఖర్చులపై తీర్మాణాలు చేయాల్సి ఉండగా, అది జరగడం లేదని పలువురు చెబుతున్నారు. ఏజెన్సీలోని రాజవొమ్మంగి మండలంలో కొన్ని గ్రామాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితులున్నాయి.ఏడాదిలో ఒకసారైన పాలకవర్గం జరిగి ఉంటే క్షేత్రస్ధాయిలో ఆరోగ్య పరిస్థితులపై తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. పీహెచ్‌సీల్లో పరిస్థితి మెరుగుపరిచేందుకు వీలు ఉంటుందని పలువురు చెబుతున్నారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగులు, గర్భిణుల మృతి సంఘటనపై పాలకవర్గంలో బలమైన చర్చ జరిగినప్పుడే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలి
రంపచోడవరం ఐటీడీఏ పాలకవర్గాన్ని సమావేశ పరచాలి. సమస్యల పరిష్కారం కోసం, గిరిజనుల తరుపున గళం వినిపించేందుకు పూర్తి అవకాశం ఉన్న వేదిక. సకాలంలో నిర్వహించడం ద్వారా ఏజన్సీలో గిరిజన గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి ఉంటుంది. ఐటీడీఏ నిధులు, ఖర్చుపై ప్రజాప్రతినిధుల్లో సృష్టత ఉంటుంది.
–బందం శ్రీదేవి, ఎంపీపీ, రంపచోడవరం