
సమావేశంలో సమస్యల వెల్లువ
డుంబ్రిగుడ: మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు కనీస సమాచారం లేకుండా ఎలా నిర్వహిస్తారని ఇన్‌చార్జి ఎంపీడీవో ఎన్.వి.వి.నరసింహమూర్తిపై పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. ఎంపీపీ బాకా ఈశ్వరి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జంగిడివలస, గొందివలస, సిమిలిగుడ, గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుడిని నియమించాలని సర్పంచ్ సునీత ఎంఈవో దృష్టికి తీసుకెళ్లారు. స్వర్ణాయిగుడ పాఠశాలలో టీవీ ఏర్పాటుచేయాలని కండ్రుమ్ సర్పంచ్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు హరి కోరా రు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. జెడ్పీటీసీ చట్టారి జానకమ్మ, వైస్ ఎంపీపీలు శెట్టి ఆనంద్‌రావు, లలీత, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.