
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి: గర్భిణులు, బాలింతలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగుల యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బసవరాజు డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో విశాఖ ఉమ్మడి జిల్లా యూనియన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.7,800 జీతంతో ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయిస్తోందని చెప్పారు. కనీస వేతనాలు అమలు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం, అరబిందో యాజమాన్యం పట్టించుకోవడంలేదని, పైగా యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం చేయాలన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.దేవి ప్రసాద్ మాట్లాడుతూ 102 ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. యూనియన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు వై.సతీష్, అల్లూరి జిల్లా అధ్యక్షుడు వి. వాసు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా యూనియన్ సదస్సు