
వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలం
రాజవొమ్మంగి: మండలంలోని లాగరాయి, కిండ్ర గ్రామాల్లో జ్వరపీడితులకు వైద్య సేవలందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. ఆయా గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించి, బాధితులను పరామర్శించారు. లాగరాయిలో చికిత్స పొందుతూ మరణించిన జగజ్జనని ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తల్లి చనిపోవడంతో అనాథగా మారిన సూర్యదీక్షిత్ (7)ను అక్కున చేర్చుకుని ఓదార్చారు. ఆ కుటుంబానికి రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం లాగరాయి పీహెచ్‌సీకి వెళ్లి లాగరాయి, కిండ్ర, లబ్బర్తి గ్రామాల్లో నెలకొన్న అనారోగ్యకర పరిస్థితులకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. అనంతం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కిండ్రలో దాదాపు మూడు నెలలుగా జ్వరం, కీళ్లనొప్పులతో ప్రజలు బాధపడుతుంటే ఈ ప్రాంతానికి కలెక్టర్ వచ్చే వరకు వారికి సరైన వైద్యం అందలేదని విమర్శించారు. ప్రతి ఇంటిలో ముగ్గురు,నలుగురు వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ మూడు పంచాయతీల్లోని ప్రజలకు సత్వరం వైద్య సేవలందించాలని కోరారు. కూలి పనులకు వెళ్లే వారు మంచం పట్టడడంతో వారి పోషణ కష్టంగా మారిందని, వారిందరికీ మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరకులు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దోమతెరలు పంపిణీ చేయాలని, రక్త నమూనాలు సేకరించి, మెరుగైన చికిత్స అందజేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సొంత పంచాయతీలోని గ్రామాల్లో ప్రజలు మూడు నెలలుగా జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే సరైన వైద్యం అందలేదనన్నారు. ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు శింగిరెడ్డి రామకృష్ణ, సర్పంచ్‌లు గణలక్ష్మి, సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి వెంకటేష్‌రాజు, నాయకులు కొంగర మురళీకృష్ణ, చీడి శివ, బొడ్డు వెంకటరమణ, జాన్‌బాబు, కామేష్, కుశరాజు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి

వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలం