
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కదంతొక్కిన గిరి రైతులు
కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు జరుగుతున్న అన్యాయం, యూరియా పంపిణీలో నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ మంగళవారం పాడేరు, చింతూరులో చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, రైతులు భారీగా తరలివచ్చారు. పాడేరు, అరకులోయ నియోజకవర్గాలకు సంబంధించి పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకున్నప్పటికీ వారంతా జిల్లా కేంద్రం పాడేరుకు చేరుకున్నారు. అనంతగిరి, అరకులోయ, హుకుంపేట మండలాల నేతలను అరకు, పాడేరు మార్గంలో పలు చోట్ల పోలీసులు అడ్డగించారు. చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లో పలుచోట్ల కొయ్యూరు మండల నేతలను అడ్డుకున్నారు. అయినప్పటికీ అన్నదాత పోరు విజయవంతమైంది.
● అడుగడుగునా కూటమి సర్కారు అడ్డంకులు
● వైఎస్సార్‌సీపీ నేతలను నియత్రించేందుకు ప్రయత్నించిన పోలీసులు
● పాడేరు, చింతూరుల్లో భారీగా నిరసన ర్యాలీలు
● రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు
పాడేరు/సాక్షి, పాడేరు : రాష్ట్రంలో యూరియా, ఎరువుల బ్లాక్‌మార్కెట్‌పై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం పాడేరులో నిర్వహించిన అన్నదాత పోరుకు విశేష స్పందన లభించింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు అనేక అడ్డంకులు సృష్టించారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో పాడేరు ఎస్‌ఐ సురేష్ నోటీసులు పట్టుకొని ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఆయనకు నోటీసు ఇచ్చే ప్రయత్నం చేశారు. అనారోగ్యం కారణంగా ఆయన విశ్రాంతి తీసుకోవడంతో పోలీసులు వెనుదిరిగారు. పాడేరు, అరకు నియోజక వర్గాలలోని11 మండలాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పాడేరులో అన్నదాత పోరు కార్యక్రమానికి వస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, స్వచ్ఛందంగా తరలివస్తున్న రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని పాడేరు చేరుకున్నారు. దీంతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్థానిక క్యాంప్ కార్యాలయం నుంచి సినిమా హాల్ సెంటర్, పాత బస్టాండ్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం బయట సీఐ దీనబంధు ఆద్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు కుదరదని చెప్పడంతో పోలీసులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. సుమారు గంటసేపు ధర్నా చేశారు. సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ అందుబాటులో లేకపోవడంతో సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో అప్పలస్వామికి రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు.
అన్నదాతకు దగా : పాడేరు ఎమ్మెల్యే,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు
రాష్ట్రంలో రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ౖరెతు సంక్షేమం విస్మరణ:
అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం
కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. ఏజెన్సీలో గిరిజన రైతులకు ఎక్కడ కూడా యూరియా, ఎరువులను సరఫరా చేయడం లేదన్నారు.
వైఎస్సార్‌సీపీ రైతు పక్షపాతి: మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉండి రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. పూర్థిస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే రాయితీపై విత్తనాలు యూరియా, ఎరువులను సక్రమంగా సరఫరా చేసిందన్నారు.
వ్యవసాయ రంగం నిర్వీర్యం: మాజీ ఎమ్మెల్యే పాల్గుణ
రైతులంటే చంద్రబాబుకు ఏ మాత్రం కూడా గిట్టదని అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ విమర్శించారు. రైతుల బాగు కోసం ఆయన ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అవుతోందన్నారు. రైతుల పక్షాన వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్‌సీపీ అండగా ఉంటూ పోరాటాలు చేస్తుందన్నారు.
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం:
ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్,
మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
చింతూరు: ఎరువులు లేక అల్లాడుతున్న రైతన్నలకు న్యాయం జరిగేవరకు వారి పక్షాన నిరంతర పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే, రంపచోడవరం నియోజకవర్గ ఇంఛార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి హెచ్చరించారు. ఎరువుల సమస్యపై మంగళవారం చింతూరులో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఎర్రంపేటలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వారు నినాదాలు చేశారు. అనంతరం ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావుకు వారు వినతిపత్రం అందచేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ముందుగానే వ్యవసాయశాఖ అధికారులతో చర్చించి రైతులకు ఎంతమేర ఎరువులు, విత్తనాలు కావాలో సమగ్రంగా తెలుసుకునే వారన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేవని, తమ ప్రభుత్వ హయాంలో ఏనాడూ రైతులు ఇన్ని ఇబ్బందులు పడలేదని వారు తెలిపారు. దళారుల బెడదలేకుండా ఎరువులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోకుండా నిర్దిష్టమైన ప్రణాళికతో రైతులను తమ ప్రభుత్వం ఆదుకుందని వారు పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు సొమ్ములు నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యేవని వారు తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రైతులు ఎరువులు, విత్తనాలు, గిట్టుబాటు ధరల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొందని, కేసులతో వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేయడంపై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంపై చూపడం లేదని వారు విమర్శించారు. రైతుల గొంతుకగా నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా అన్నదాతకు న్యాయం జరిగేలా చూస్తామని వారు భోరాస ఇచ్చారు. జెడ్పీటీసీలు చిచ్చడి మురళి, గుజ్జా విజయ, ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీలు మేడేపల్లి సుధాకర్, యడమ అర్జున్, పార్టీ మండల కన్వీనర్ యగుమంటి రామలింగారెడ్డి, నాయకులు తోట రాజేశ్వరరావు, మద్దాల వీర్రాజు, జల్లిపల్లి రామన్నదొర, కోట్ల కృష్ణ, ఎండీ జిక్రియా, మాదిరెడ్డి సత్తిబాబు, చిక్కాల బాలు, ఆవుల మరియాదాసు, పార్టీకి చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు పాల్గొన్నారు.
హోరెత్తిన
అన్నదాత పోరు
తీవ్రంగా నష్టపోయాం
కూటమి ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయాం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సకాలంలో విత్తనాలు, ఎరువులు అందేవి. ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం.
– పి.శోభన్‌బాబు, రైతు, కండ్రుం పంచాయతీ, డుంబ్రిగుడ మండలం
రైతులకు చేసింది శూన్యం
ఏడాదిన్నర కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు చేసింది శూన్యం. ఒక్క రైతుకు కూడా వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఇవ్వలేదు. రైతులను ప్రభుత్వం దగా చేస్తోంది.
– టి.రామారావు, కుంతర్ల, పెదబయలు మండలం
ఆర్‌బీకేలు నిర్వీర్యం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రైతులకు రాయితీపై రుణాలు, ఎరువులు ఇవ్వకుండా మోసం చేసింది. – ఎం. అప్పారావు,
బాబుసాల, ముంచంగిపుట్టు మండలం
గిట్టుబాటు ధరలు కరువు
గిరి రైతులు సాగు చేస్తున్న పంటలకు గిట్టుధరలు లేకపోవడంతో నష్ట పోతున్నాం. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎరువులు సకాలంలో ఇవ్వలేకపోయింది.
–తిమోతి, పెదవలస, గూడెంకొత్తవీధి మండలం

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కదంతొక్కిన గిరి రైతులు

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కదంతొక్కిన గిరి రైతులు

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కదంతొక్కిన గిరి రైతులు

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కదంతొక్కిన గిరి రైతులు

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కదంతొక్కిన గిరి రైతులు

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కదంతొక్కిన గిరి రైతులు