
అరకొర యూరియా కేటాయింపుపై ఆగ్రహం
సీలేరు: గిరిజన రైతులకు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ఇదే నెలలో గూడెంకొత్తవీధి మండలానికి 58 టన్నుల యూరియా ఇవ్వగా ఈ ఏడాది 12 టన్నులు కేటాయించింది. వీటిలో 267 బస్తాలు రావడంతో మండల కేంద్రానికి 90, ధారకొండ రైతు సేవా కేంద్రానికి 177 బస్తాలు అందించారు. ఈ విషయం తెలుసుకున్న ధారకొండ, గుమ్మరేవులు, దుప్పులవాడ పంచాయతీలకు చెందిన సుమారు 750 మంది రైతులు మంగళవారం ఇక్కడికి చేరుకున్నారు. మండుటెండలో గంటల తరబడి నిరీక్షించారు. పంపిణీ చేసేందుకు మధ్యాహ్నం రెండు గంటలకు ఏవో గిరిబాబు వచ్చారు. అందరికీ పంపిణీ చేసేందుకు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. అందరికీ ఇవ్వాల్సిందేనని వారు పట్టుబట్టారు. రెండో విడత వచ్చినప్పుడు మిగతా వారికి వచ్చేందుకు ఏవో, సర్పంచ్ రాజు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే అందరికీ ఇవ్వాల్సిందేనని రైతులు స్పష్టం చేయడంతో రెండో విడత వచ్చిన ఎరువులతో కలిపి మొత్తం అందరికీ అందజేస్తామన్నారు. దీంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఎస్‌ఐ రవీంద్ర గొడవ జరగకుండా చర్యలు చేపట్టారు.
అందరికీ పంపిణీ చేయాలని
ధారకొండలో గిరిజన రైతుల డిమాండ్

అరకొర యూరియా కేటాయింపుపై ఆగ్రహం