
వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
● నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు
● రాజేంద్రపాలెం ఆస్పత్రి తనిఖీ
కొయ్యూరు: ఎపిడమిక్ సమయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు హెచ్చరించారు. మంగళవారం ఆయన రాజేంద్రపాలెం పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతపై గిరిజనులకు అవగాహన కల్పించాలని కోరారు. పరిశుభ్రత పాటించడం వల్ల దోమల ప్రభావం తగ్గించవచ్చన్నారు. వర్షాకాలంలో మరగబెట్టిన నీటిని తాగేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో విధిగా వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైద్యాధికారి స్నేహలత, సీహెచ్‌వోఎల్ ప్రశాంత్, హెచ్‌వీలు పాల్గొన్నారు.