
రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు అన్యాయం
అర్హులందరికీ అందని ‘అన్నదాత సుఖీభవ’
యూరియా సరఫరాలో నిర్లక్ష్యం అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి
సాక్షి,పాడేరు: రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి డిమాండ్ చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో ఉన్న ఆమె మంగళవారం సాక్షితో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు. రైతు భరోసాతో పాటు అనేక రైతు సంక్షేమ పథకాలను అప్పటి సీఎంజగన్‌మోహన్‌రెడ్డి సమర్ధవంతంగా అమలుజేశారన్నారు. గిరిజన రైతులకు కూడా ఎంతో మేలు జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు అన్ని విధాల అన్యాయమే జరుగుతుందన్నారు. గతేడాది అన్నదాత సుఖీభవను కూటమి ప్రభుత్వం అమలుజేయకపోవడంతో రైతులంతా ఆర్ధికంగా నష్టపోయారని, ఈఏడాది అమలుజేసిన అర్హులు అనేకమందికి అన్యాయం జరిగిందన్నారు. యూరియాకు డిమాండ్ ఉన్నప్పటికీ సకాలంలో రైతులకు అందుబాటులో తేలేదని, గిరిజన ప్రాంతాల్లో ప్రైవేట్ డీలర్ల వద్ద అధిక ధరలకు రైతులు కొనుగోలు చేసి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారన్నారు. అన్ని రైతు సేవా కేంద్రాలలో యూరియాను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచి గిరిజన రైతులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.