
సీలేరులో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు
● తలెత్తిన
సాంకేతిక లోపం
సీలేరు: విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సు సాంకేతిక లోపం వల్ల సీలేరులో నిలిచిపోయింది. విశాఖపట్నంలో మంగళవారం ఉదయం ఐదు గంటలకు బయలుదేరిన ఈ బస్సు సీలేరు వచ్చేసరికి సాంకేతిక లోపం వల్ల స్టీరింగ్ పట్టేయడంతో కదల్లేదు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నర్సీపట్నం నుంచి సీలేరు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన బస్సును భద్రాచలం మళ్లించి అందులో ప్రయాణికులను పంపించారు. పదిరోజులకు ఒకసారి ఇలాంటి పరిస్థితిని ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. ఘాట్‌రోడ్డుకు తగ్గట్టుగా కండీషన్‌లో లేని బస్సులను నడపడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును ఆర్టీసీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై వారు ధ్వజమెత్తుతున్నారు.