
కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజలకు వివరించాలి
● ఎమ్మెల్సీ అనంతబాబు,
రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి
● చింతూరులో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమానికి విశేష స్పందన
చింతూరు: బాబు ష్యూరిటీ పేరుతో ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కాక వాటిని విస్మరించిన కూటమి ప్రభుత్వం మోసాలను కార్యకర్తలంతా గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలని ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, రంపచోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. చింతూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి వంటి పథకాలను అమలు చేయకుండానే అన్ని పథకాలను ఇచ్చేశామంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కులం, మతం, పార్టీలకు అతీతంగా పథకాలు అందించామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అర్హులైన వారికి కూడా పథకాలు తొలగిస్తోందన్నారు. నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో అమ్మఒడి పథకం ద్వారి ఇంటికొకరి చొప్పున 60 లక్షల మంది తల్లులకు సొమ్ములు అందజేశారని, కూటమి ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం పేరుతో లబ్ధిదారుల సంఖ్యను కుదించిందన్నారు. ఏజెన్సీలో పోడు భూములకు కొండపోడు పట్టాలిచ్చిన ఘనత జగనన్న ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కూటమి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కొండపోడు పట్టాలను గిరిజనులకు మంజారు చేయించాలని డిమాండ్ చేశారు. పోలవరం పరిహారం ఇవ్వకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారని, ధ్రువపత్రాల కోసం నిర్వాసితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రతి నిర్వాసితుడికి న్యాయం జరిగేవరకు వైఎస్సార్‌సీపీ వారికి అండగా ఉంటుందని, నిర్వాసితులెవరూ ఆందోళన చెందవద్దని వారు తెలిపారు. మోసపూరిత హామీలతో గద్దెక్కిన కూటమి నాయకులు నియోజకవర్గంలో అభివృద్ధిని విస్మరించి దోచుకోవడం, దాచుకోవడంలో బిజీగా మారారని వారు విమర్శించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజా ప్రతినిధుల విషయంలో ప్రొటోకాల్ పాటించని అధికారులను నిలదీయాలని, గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులు, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు సూచించారు. అర్హతవున్నా ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా అన్యాయంగా వేధించేవారిని ఉపేక్షించబోమని వారు హెచ్చరించారు. పథకాలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కూటమి నాయకులను గ్రామస్తులు నిలదీసేలా చేయాలని కార్యకర్తలకు సూచించారు. జెడ్పీటీసీ చిచ్చడి మురళి, ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీలు మేడేపల్లి సుధాకర్, యడమ అర్జున్, కో–ఆప్షన్ సభ్యుడు ఎండీ జిక్రియా, నాయకులు కోట్ల కృష్ణ, బాబూరావు, రాంప్రసాద్, మురళి, ఖాదర్‌షరీఫ్, సీతారామయ్య, సాయి, రాంబాబు, రాజు, మహేష్, మోతుగూడెం నాయకులు పేపకాయల శ్రీను, శివరామకృష్ణ, మీనా సుజాత, వేగి రాజా తదితరులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజలకు వివరించాలి