
దాడి ఘటనపై ఏఎస్పీ విచారణ
ఎటపాక: మండలంలోని గౌరిదేవిపేట గ్రామంలో ఈనెల 6న జరిగిన దాడి ఘటనపై చింతూరు ఏఎస్పీ పంకజ్‌కుమార్ మీన సోమవారం గ్రామంలో పర్యటించి, విచారణ జరిపారు. గ్రామానికి చెందిన గవ్వల వెంకటేష్ తనపై అదే గ్రామానికి చెందిన సాయిబాబు దుర్బాషలాడి దాడి చేసి గాయపర్చారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటి కేసుగా నమోదు చేశారు. ఈ క్రమంలో ఏఎస్పీ బాధితుడితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా దాడి సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించి వారి సాక్ష్యాలను నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏఎస్పీ వెంట సీఐ కన్నపరాజు, ఎస్‌ఐ అప్పలరాజు ఉన్నారు.