
సంఘటిత పోరాటాలకు కార్మికులంతా సిద్ధం కావాలి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు
చోడవరం: సంఘటిత పోరాటాలకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి. నాగేశ్వరరావు పిలుపిచ్చారు. సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియూ)13వ జిల్లా మహాసభలు చోడవరంలో రెండ్రోజులుగా జరుగుతున్నాయి. ఈ మహాసభలు ఆదివారం ముగిశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలపై అనుసరిస్తున్న వైఖరి, కార్మికుల ఉద్యమాలపై ఈ సభల్లో చర్చించారు. ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మిక వర్గాలపై తీవ్ర దాడులకు పాల్పడుతున్నాయని, దీనిని అంతా తిప్పి కొట్టాలన్నారు. భవిష్యత్ ఉద్యమాలు మరింత తీవ్ర తరం చేయాలన్నారు. ఇప్పటికే పనిగంటలు పెంచుతూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడం, కాంట్రాక్టు కార్మికులను అప్కాస్ రద్దు చేసి ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులపై దాడిని ఎక్కుపెట్టిందన్నారు. అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక కార్మికుల సమస్యలపై మరింత ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫార్మా, ఎస్‌ఈజెడ్‌లలో కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేవని ప్రమాదాల నివారణలకు యజమాన్యాలు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో కార్మికులకు అండగా సీఐటీయూ ఎప్పుడూ నిలుస్తుందన్నారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి సీఐటీయూ తన వంతు భాగస్వామ్యం అందించిందన్నారు. భవిష్యత్ పోరాటాలకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలని ఈ మహాజనసభలో తీర్మానించారు. 28 తీర్మానాలతో కార్యదర్శి నివేదికను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో సీఐటీయు నాయకులు లోకనాథం, జి. కోటేశ్వరరావు, ఆర్. శంకరరావు, వి.వి.శ్రీనివాసరావు, ఎ.రాజు, గూనూరు వరలక్ష్మి, ఎస్.వి.నాయుడు, గనిశెట్టి సత్యనారాయణ, ప్రేమ చంద్రశేఖర్, పాల్గొన్నారు.