
అధికలోడుతో వెళ్తున్న టిప్పర్లు పట్టివేత
రూ.1.82 లక్షలు జరిమానా విధింపు
నక్కపల్లి: నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడు వేయడమే కాకుండా టోల్‌ఫీజును ఎగ్గొట్టేందుకు దొడ్డిదారిలో వెళ్తున్న టిప్పర్లపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. మూడు టిప్పర్లను పట్టుకుని రవాణా శాఖ అధికారులకు అప్పగించడంతో వారు ఈ మూడు లారీలకు భారీగా జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే పరవాడ నుంచి కాకినాడ, రాజమండ్రి నుంచి రాంబిల్లి వైపు పెద్ద పెద్ద బండరాళ్లు, ఫైయాష్, ఇసుక లోడుతో ఇటీవల కాలంలో నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లు తిరుగుతున్నాయి. ఒక్కో టిప్పర్‌లో నిబంధనల ప్రకారం 40 టన్నులకు మించి లోడు వేయరాదు. కానీ ఈ ట్రిప్పర్లు 60 నుంచి 70 టన్నుల బరువుతో రాకపోకలు సాగిస్తున్నాయి. వేంపాడు టోల్‌ప్లాజా వద్ద వీటి బరువు పరిశీలించి అధిక ఫీజు వసూలు చేస్తున్నారు. టిప్పర్ యజమానులు టోల్‌ఫీజును ఎగ్గొట్లేందుకు దొడ్డిదారిని ఎంచుకున్నారు. నక్కపల్లి, ఉపమాక, చందనాడ, అమలాపురం మీదుగా వేంపాడు జాతీయ రహదారిని చేరుకుని అక్కడ నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్తున్నాయి. రాజమండ్రి వైపు నుంచే వెళ్లే వాహనాలు కూడా వేంపాడు, అమలాపురం, చందనాడ, నర్సాపురం, ఉపమాక మీదుగా నక్కపల్లి చేరుకుని రాంబిల్లి వెళ్తున్నాయి. ఆదివారం ఉదయం మూడు టిప్పర్లు అధిక లోడుతో ఉపమాక మీదుగా వేంపాడు వెళ్తుండగా సీఐ కుమార స్వామి, ఎస్‌ఐ సన్నిబాబు దాడులు చేసి ఉపమాక వద్ద టిప్పర్లను పట్టుకున్నారు. పరిమితికి మించి లోడు వేసినట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం నర్సీపట్నం ఎంవీఐకి పంపించగా మూడు లారీల్లో ఒకదానికి రూ.52 వేలు, రెండోదానికి రూ.58 వేలు, మూడో టిప్పర్‌కు రూ.72వేలు వెరసి మూడు టిప్పర్లకు రూ.1.82 లక్షలు పెనాల్టీ విధించినట్టు సిఐ కుమారస్వామి తెలిపారు.